Rush at Fruit Markets in Telangana: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వచ్చిందంటే చాలు వివిధ రకాల పండ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రతి కుటుంబంలో పండ్ల వినియోగం తప్పసరి కావడంతో మార్కెట్‌కు పండుగ కళ వచ్చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండ్ల క్రయ, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ శివారు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో వ్యవసాయ మార్కెట్ యార్డుకు పండ్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. అవసరమైన పండ్లను మార్కెట్‌లో అందుబాటులో పెట్టడంతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పోటెత్తుతున్నారు.
Mahashivratri : పండుగ వేళ మంచి ధరలు వస్తాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, ఆపిల్, పుచ్చకాయ, ఖర్భూజ, పైనాపిల్, మామిడి తదితర పండ్లు విక్రయానికి తీసుకురావడంతో సందడి వాతావరణం నెలకొంది. గత ఏడాది శివరాత్రి సమయంతో పోల్చితే ఈసారి బాటసింగారం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ పండ్ల రాక బాగా పెరిగిపోయింది. వాతావరణం ఆశాజనంగా ఉండటంతో.. ఈ సీజన్‌లో పండ్ల ఉత్పత్తి ఎక్కవగా మార్కెట్‌కు తరలివస్తోంది.
నాలుగు రోజుల ముందు నుంచే పండ్ల రాక అధికమైన దృష్ట్యా.. ఒకదశలో ధరలు పడిపోతాయో అన్న భయం రైతుల్లో నెలకొంది. కానీ ధరలు స్థిరంగా ఉండటంతోపాటు రేట్లు కూడా బాగానే పెరిగాయి. పండ్లన్నీ టోకు ధరల్లో విక్రయిస్తున్న దృష్ట్యా... నాణ్యత, పరిమాణం బట్టి నల్ల ద్రాక్ష 7 కిలోల బాక్సు 350 నుంచి 400 రూపాయలు, వైట్ గ్రేప్స్ 15 కిలోల బాక్స్ 1000 నుంచి 1400 రూపాయలు, పుచ్చకాయ పది కిలోలు 100 రూపాయలు, ఖర్భూజ పది కిలోలు 170 నుంచి 200 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు.