హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణంలో కీలక సెగ్మెంట్‌ల అమరిక పూర్తికావచ్చింది. మొత్తం 53కు గానూ 50 సెగ్మెంట్లు ఉక్కు తీగలకు అనుసంధానం చేశారు. ఒక్కో సెగ్మెంట్ 26 మీటర్ల ఎత్తు, 4 మీటర్ల వెడల్పుతో 160 టన్నుల బరువు ఉంటుంది. మరో వారం రోజుల్లో మిగిలిన రెండు సెగ్మెంట్ల పనులు పూర్తి చేసి.... కీ సెగ్మెంట్ అమరిక పనులు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని.... జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఫ్లై ఓవర్పైనా పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో తుది మెరుగులు దిద్ది సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
దేశంలోనే పొడవైన వంతెన...
దుర్గం చెరువు తీగల వంతెన పొడవు సుమారు 755 మీటర్లు. మధ్యలో సుమారు 234మీటర్ల దూరంలో 57 మీటర్ల ఎత్తైన రెండు స్తంభాలు నిర్మించారు. వంతెన నిర్మాణ వ్యయం రూ. 184 కోట్లు కాగా... విద్యుద్దీపాల అలంకరణకు రూ. 11 కోట్లు, ప్రహరీ నిర్మాణానికి రూ. 15 కోట్లు కేటాయించారు. సెగ్మెంట్ల అమరిక పూర్తయితే వంతెన నిర్మాణం దాదాపు పూర్తయినట్లే. తరువాత రంగు రంగుల విద్యుద్దీపాలతో తీగల వంతెనను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నన్నారు. పనులన్నీ పూర్తయితే...దేశంలోనే పొడవైన తీగల వంతెనగా దుర్గం చెరువు వంతెన నిలవనుంది.