ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో 54 డివిజన్లున్నాయి. శివారు కాలనీల్లో రోజువారి కూలీలు, యాచకులు ఎక్కువగా ఉంటారు. లాక్‌డౌన్ ప్రభావంతో ఇప్పుడు వీరంతా ఆకలితో అలమటిస్తున్నారు. ప్రస్తుతం పనుల్లేక కూలీలు కుటుంబ పోషణకు దారిలేక అల్లాడుతున్నారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఆడవాళ్లను కూడా పనులకు పిలవడంలేదు. గతంలో అంట్లుతోమడం, బట్టలు ఉతకడం వంటి పనులతో జీవనం సాగించిన వారంతా ఇప్పుడు పూటగడవక అవస్థలు పడుతున్నారు.
దాతలే శరణ్యం
లాక్‌డౌన్ పొడగించడం వల్ల పనులపై ఆశలు వదులుకున్న కూలీలు దాతలనే నమ్ముకున్నారు. భోజన పొట్లాలు పంచేవాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డెక్కితే పోలీసులు కొడతారేమోననే భయంతో ఉదయం నుంచే ఇళ్ల ముందు నిలుచుని వేచిచూస్తున్నారు. భోజన పొట్లాలు పంచే వాహనాలు రాగానే పరుగులు తీస్తున్నారు. వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకూ ఇదే పరిస్థితి. ఒక్క ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిందనుకుని సరిపెట్టుకుంటున్నారు. ఉదయం ఇచ్చే భోజన పొట్లాలతో కడుపునింపుకుంటున్న కొందరు పేదలు రాత్రిళ్లు పస్తులుంటున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా దాతలెవరైనా భోజనాలు పంచాలంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాలని అధికారులు ప్రకటించడం వల్ల ఇప్పుడు దాతలు పెద్దగా ముందుకురాని పరిస్థితి నెలకొందని నిరుపేదలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.