తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులను కాటేస్తోన్న కరోనా - private teachers problems with corona pandemic situations

బతకలేక బడి పంతులు అనేది గతం... బడి పంతులు బతికేలా లేడు అనేది ప్రస్తుతం. ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడిగా జీవనం సాగిస్తోన్న ఆ వ్యక్తిని కరోనా మహమ్మారి రోడ్డెక్కించింది. పాఠాలు చెప్పిన గురువే... ఈరోజు బేరాలాడుతూ పండ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వేదాయపాళెం ప్రాంతంలో ఉంటోన్న వెంకటసుబ్బయ్యపై లాక్ డౌన్ ఏవిధంగా ప్రభావం చూపిందో మీరూ చూడండి.

Teacher Dominated with Corona Effect
ప్రైవేటు ఉపాధ్యాయలను కాటేస్తోన్న కరోనా

By

Published : Jun 6, 2020, 11:02 PM IST

Updated : Jun 7, 2020, 5:11 AM IST

బతకలేక బడి పంతులు అన్నది పాత సామెత... కానీ ఇప్పుడు అది తిరగబడింది. బడి పంతులు ఉపాధి కోల్పోయి... చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కరోనా మహమ్మారి వేసిన కాటు ప్రైవేటు బడి పంతుళ్ల జీవితాల పాలిట యమపాశంగా మారింది. బతకలేక, చావలేక... అలా అని వేరే పనులు చేయలేక బిక్కుబిక్కుమంటూ మౌనంగా రోదిస్తున్నాడు ప్రైవేటు ఉపాధ్యాయుడు.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు నగరం వేదాయపాళెం ప్రాంతంలో వెంకటసుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, డీఈడీ పూర్తి చేశాడు. వెంకటసుబ్బయ్య నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన తన కుమారుడి వైద్యం కోసం... దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పు చేసినా, తనకొచ్చే జీతంతో అన్ని కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

లాక్ డౌన్ ప్రభావం.. వృత్తే మారింది

ఈ క్రమంలో లాక్​డౌన్ కారణంగా ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి దయనీయంగా మారింది. విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొంతకాలం ఆన్​లైన్ ద్వారా వెంకటసుబ్బయ్యతో క్లాసులు చెప్పించారు. కొత్త విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్ చేరుకోలేకపోవటంతో... ఆ విద్యాసంస్థ ఆయనను పక్కన పెట్టింది. దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్న ఆ ఉపాధ్యాయుడు... చివరకు తోపుడు బండిపై అరటిపండ్లు అమ్మటం ప్రారంభించాడు.

స్థానిక గాంధీనగర్ రోడ్డులో బండిపై అరటి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎంతో మంది ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ఇలాగే ఉందని... ప్రభుత్వమే ఎలాగైనా తమని ఆదుకోవాలని వెంకటసుబ్బయ్య కోరుతున్నారు.

ఇదీ చూడండి :బైక్​ కావాలని ఒకరు.. రూ.200 కోసం మరొకరు ఆత్మహత్య!

Last Updated : Jun 7, 2020, 5:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details