DSC 2008 women candidates strike:అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు డీఎస్సీ 2008 మహిళా అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. డీఎస్సీ 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో సంయుక్తంగా "మహిళా సాధికారత కోసం దీక్ష" పేరుతో హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్కు ధర్నాచౌక్లో రిలే నిరహార దీక్ష చేపట్టారు. వీరితో పాటు ఈ దీక్ష శిబిరాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తిరునగిరి జోత్స్న సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
డీఎస్సీ 2008 అభ్యర్థుల సమస్య న్యాయబద్ధమైందని వారి సమస్యపై తన వంతు బాధ్యతగా అసెంబ్లీలో ప్రశ్నించి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. డీఎస్సీ 2008 అభ్యర్థుల సమస్యపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఈ ప్రభుత్వానికి అవాంతరాలు ఏమిటో స్పష్టం చేయాలని ఆమె నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో ఆమె ప్రశ్నించారు. డీఎస్సీ 2008 అభ్యర్థులు 2008 నుంచి చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.