Drunk and Drive Cases in Telangana : రాష్ట్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. వాహనచోదకులు మద్యం సేవించి.. రోడ్డు ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు. మితిమిరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి.. కేసులు నమోదు చేసినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.
Road Accidents in Telangana :మద్యం సేవంచి వాహనాలు నడపడం.. మళ్లీ కేసుల్లో ఇరుక్కోవడం.. కటకటాల పాలవడం ఫైన్ కట్టి బయటకు వచ్చేయడం.. మళ్లీ తాగి తప్పు చేయడం కొందరికి అలవాటైంది. మరి కొందరైతే తమ వాహనాలను.. తనిఖీ చేస్తున్న ప్రదేశంలోనే వదిలేసి వెళ్తూ తిరిగి తీసుకెళ్లడం లేదు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కేసులు నమోదు చేసి బండ్లు సీజ్ చేసినా.. మందుబాబులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు.
అనునిత్యం పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక్కో పోలీసు స్టేషన్ పరిధిలో.. ప్రతిరోజు దాదాపు రెండు గంటల పాటువాహన తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట వాహనచోదకులకు.. బ్రీత్ ఎనలైజర్‌తో శ్వాస పరీక్షలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. తాగి వాహనాలు నడుపుతున్న వారందరిపై ఏకకాలంలో కేసు నమోదు చేస్తున్నారు. దీంతో కొన్ని పోలీస్స్టేషన్లకు బ్రీత్ ఎనలైజర్‌ల కొరత ఏర్పడింది. ఈ సమస్యకు అధిగమిస్తే వాహన తనిఖీల సంఖ్య పెంచి.. మందుబాబులకు అడ్డుకట్ట వేయవచ్చు.