తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యూ ఇయర్ వేళ కిక్కేకిక్కు - 3 కమిషనరేట్లలో 3000కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

Drunk and Drive Cases in Hyderabad 2024 : రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2023కి వీడ్కోలు పలుకుతూ, 2024 నూతన ఏడాదికి ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 3000వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

Drunk and drive cases
Drunk and drive cases

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 12:16 PM IST

Updated : Jan 1, 2024, 4:08 PM IST

Drunk and Drive Cases in Hyderabad 2024 :నూతన సవంత్సరం వేడుకల వేళ నగరంలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్(Hyderabad) పరిధిలో 1243, సైబరాబాద్ 1241 కేసులు, రాచకొండ పరిధిలో 517 కేసులు నమోదయ్యాయి. మూడు కమిషనరేట్ పరిధిలో మొత్తం 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలతో పాటు 1239 మందిపై కేసులు నమోదయ్యాయి. తాగి డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Drunk and Drive Cases in Telangana : సుక్క పడిందంటే ప్రతి ఒక్కడూ రైడరే.. రోడ్డెక్కి ఏ బండికో గుద్దుడు ఖాయమే.. ఏం చేసేది మరి?

సైబరాబాద్(Cyberabad) పరిధిలో పలు చోట్ల తనిఖీల సమయంలో పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 1243 కేసుల్లో 1066 ద్విచక్ర వాహనాలు, 42ఆటోలు, 135 కార్లను స్వాధీనం చేసుకున్నారు. యజమానులపై కేసులు నమోదు చేశారు. రాచకొండ పరిధిలో మొత్తం 517 కేసులు నమోదు కాగా వాటిలో 431 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 76 కార్లను స్వాధీనం చేసుకున్నారు. తాగి వాహనాలు నడిపిన వారిలో అత్యధికంగా 40 సంవత్సరాల లోపు ఉన్నవారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన వారికి తల్లిదండ్రులు, బంధువులు సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం మోతాదు, ఎన్ని సార్లు మద్యం సేవించి పట్టుబడ్డారు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు వారికి జరిమానా, జైలు శిక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో పాటు తాగి వాహనాలు నడిపిన వివరాలను ట్రాఫిక్ పోలీసులు ఆర్టీఏ అధికారులకు పంపనున్నారు. తద్వారా వారి డ్రైవింగ్ లైసెన్సులు సైతం రద్దు అయ్యే అవకాశం ఉంది.

మందుబాబులకు వింత శిక్ష.. స్టేషన్​లో కూర్చోబెట్టి 1000సార్లు ఇంపోజిషన్.. ఏం రాయించారంటే..

Road Accidents on New year Day : నూతన సంవత్సరం వేళ పలు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం అయిదుగురు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా అధిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొంగళూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై అదుపు తప్పి ద్విచక్రదారుడు కింద పడ్డాడు. తీవ్ర గాయాలతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మృతుడు కందుకూరుకి చెందిన రథలవాత్ అనిల్‌కుమార్‌గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా యువకుడు మృతి చెందాడు. మిత్రహిల్స్ నుంచి హైదర్‌నగర్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా మోతినగర్‌కి చెందిన అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గత రాత్రి బాలనగర్ పోలిస్‌స్టేషన్ పరిధిలో మేజిస్టిక్ గార్డెన్ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అతను మృతి చెందాడు. దర్యాప్తులో ప్రమాదానికి ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లిఖార్జున నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కానిస్టేబుల్ మల్లిఖార్జున ఈ ప్రమాదం చేసినట్లు తేల్చారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు సమాచారం. వారం రోజులుగా అతను సెలవులో ఉన్నట్లు తెలిపారు. మాదాపూర్ పరిధిలోని హైటెక్ సిటిలో వేగంగా వచ్చిన కారు పాదాచారుడిని ఢీకొనగా అతను తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు మృతుని వివరాలు సేకరిస్తున్నారు. మరో కేసులో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు నోవపాన్ కూడలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూకి స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొని భరత్ చంద్, నితిన్‌లు మృతి చెందారు. మరో యువకుడు వంశీ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా.. దొరికితే ఇక జైలుకే..!

Last Updated : Jan 1, 2024, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details