హైదరాబాద్ నగరానికి చెందిన పదిహేడు ఏళ్ల బాలుడు గంజాయి మత్తులో వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స తర్వాత తల్లిదండ్రులు అతడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. నిపుణుల కౌన్సెలింగ్‌లో మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని సేవించడం ఆరంభించినట్టు తేలింది. తరచు గోవాకు వెళ్తూ డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నాడు. అధిక మోతాదులో హెరాయిన్ తీసుకొని బీచ్‌లో పడి ఉన్న కొడుకు గురించి గోవా పోలీసులు ఫోన్ చేయడం తల్లిదండ్రుల్ని షాక్‌కి గురి చేసింది. ఆ అబ్బాయిని అక్కడినుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా అదే అలవాటు కొనసాగిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కాలేజీకి వెళ్లి అసాధారణంగా ప్రవర్తించాడు. ఈ విషయం గమనించిన యాజమాన్యం అతడిని కాలేజీ నుంచి సస్పెన్స్ చేసింది. తల్లిదండ్రులు ఆ కుర్రాడికి కౌన్సిలింగ్ ఇప్పించగా.. రెండేళ్లుగా అతడు మత్తుపదార్థాలకు అలవాటు పడినట్లు తేలింది. మాదకద్రవ్యాలు కొనేందుకు డబ్బు కోసం బైక్ రేస్‌లలో పాల్గొంటున్నట్టు తేలింది. డ్రగ్స్ కొని అతడు చదివే కాలేజీలో అమ్ముతూ.. కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాడు.
లాక్‌డౌన్ సమయంలో దేశమంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. కానీ మత్తు పదార్థాల దందా మాత్రం విస్తృతంగా సాగింది. ఒకప్పుడు ఈ ముఠాలకు నగరంలో చిరునామాగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి పరిస్థితి బస్తీలకు మారిపోయింది. గోల్కొండ లక్ష్మీనగర్, ధూల్‌పేట, ఎల్‌బీనగర్ సర్కిల్‌లో కొన్ని ప్రాంతాలు, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ముషీరాబాద్, కూకట్‌పల్లిలలో కొన్ని గల్లీలకు సైతం మత్తు పదార్థాల దందా విస్తరిస్తోంది.
తల్లిదండ్రులే గుర్తించాలి
విద్యార్థులు పెడధోరణి పడుతున్న ఆరంభంలోనే గుర్తించగలిగితే పరిస్థితి చేయిదాటదు. గతానికి భిన్నంగా విపరీత ధోరణుల్ని ప్రదర్శించడం, బ్యాక్‌లాగ్స్ పెరిగిపోవడం, నిర్లిప్తంగా ఉన్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి అని సూచిస్తున్నారు అమృత ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దేవికారాణి.