Drugs Seized in Hyderabad : హైదరాబాద్‌లో మత్తుపదార్థాల సరఫరాపై.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రాజస్థాన్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వెల్లడించారు.
Drugs bust in Hyderabad : ఏడాది క్రితం వ్యాపారం నిమిత్తం రాజస్థాన్‌లోని జాలొరు జిల్లాకు చెందిన దీపారామ్ హైదరాబాద్‌కు వచ్చాడని డీఎస్ చౌహాన్ తెలిపారు. గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న అతను మాదకద్రవ్యాలకు (Drugs)బానిస అయ్యాడని చెప్పారు. ఈ క్రమంలో రాజస్థాన్‌కు చెందిన రమేశ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. రమేశ్ నుంచి హెరాయిన్, ఎండీఏంఏ కొనుగోలు చేసిన దీపారామ్.. కొరియర్ ద్వారా వాటిని నగరానికి తీసుకొచ్చాడని డీఎస్ చౌహాన్ వివరించారు.
అపార్ట్మెంట్లో గంజాయి పెంచుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. యూట్యూబ్‌లో నేర్చుకుని మరీ..
మరోవైపు మాదక ద్రవ్యాలను దీపారామ్ వినియోగించడంతోపాటు.. ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడని డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారం అందిందని.. అతడిపై నిఘాపెట్టి చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడి వద్ద నుంచి హెరాయిన్‌తో పాటు ఎండిఎంఏ (MDMA Drug)డ్రగ్నుస్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ క్రమంలోనే దీపారామ్కు మాదకద్రవ్యాలు సరఫరా చేసిన రమేశ్ కోసం గాలిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు.
Telangana Narcotics Bureau(TNAB) : 'అవగాహనతోనే యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచగలం'
మరో కేసులో పదేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడిన.. మహేందర్ సింగ్ అనే వ్యక్తిని.. మహేశ్వరం జోన్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారని డీఎస్ చౌహాన్ తెలిపారు. నిందితుడి నుంచి 2.2 కిలోల ఓపియం డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తుర్కయంజాల్‌లోని రామనగర్‌లో ఉంటున్న మహేందర్ సింగ్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడని వివరించారు. కరోనా సమయంలో నష్టాలు రావడంతో.. మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.