హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురి నుంచి 25 గ్రాముల కొకైన్, 105 గ్రాములు ఎండీఎంఎ, 25 గ్రాములు హసీస్ ఆయిల్, 4 ఎల్ఎస్డీ బ్లాట్స్, 250 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం, ఏడు చరవాణులను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు - excise enforcement officers
అధికారులు ఎన్ని దాడులు చేసినా మాదకద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని మధురానగర్‌లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ ముగ్గురి నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
అమీర్‌పేట సమీపంలోని మధురానగర్‌లో మాదకద్రవ్యాలు విక్రయాలు చేస్తున్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని తుకరాల భరత్, రాణాప్రతాప్, షేక్ ఫిరోజ్ అహ్మద్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఏఈఎస్ అంజిరెడ్డి వెల్లడించారు. మాదకద్రవ్యాలతోపాటు 6ఎంఎం సూదులు 18, 5ఎంఎల్ స్టెరిలైజ్‌డ్ వాటర్ ఆంపిల్స్, తొమ్మిది, డిజిటల్ ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలు, రెండు 450 గ్రాముల ఖాలీ పాలీథీన్ సాచెట్స్, 225 గ్రాముల ఖాళీ పాలీథీన్ సాచెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ముగ్గురిని విచారించగా మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అందులో అఖిల్ ఆదిత్య, బెంగళూరుకు చెందిన జేమ్స్, దిల్లీకి చెందిన జామి, చెన్నైకి చెందిన ఇర్ఫాన్, అబ్దుల్, హైదరాబాద్ లంగర్ హౌస్‌కు చెందిన భరత్ సింగ్ తదితరులు ఉన్నట్లు వారు తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతూ దొరికిపోయిన వారిని జైలుకు తరలించారు.
ఇవీ చూడండి: గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం