KP Chowdary Drugs Case Custody Report : మాదకద్రవ్యాల కేసులో నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. 82.75 గ్రాముల కొకైన్‌ను కేపీ చౌదరి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని.. అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు కస్టడీకి తీసుకుని లోతుగా విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కింగ్‌పిన్ గాబ్రియల్‌తో సంబంధాలు, సినీ, రాజకీయ ప్రముఖుల్లో కొకైన్ కొనుగోలు చేసిన వారి వివరాల గురించి అతన్ని పోలీసులు ఆరా తీశారు.
గోవా, హైదరాబాద్‌లో జరిగిన పార్టీల్లో సినీ నటులు మత్తు పదార్ధాలు తీసుకున్నారా ? ఎప్పటి నుంచి నగరానికి వీటిని సరఫరా చేస్తున్నారు వంటి తదితర అంశాలపై నిందితుడి నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాత కేపీ చౌదరి సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నిందితుడు డ్రగ్స్ సరఫరా చేసే లిస్ట్‌లో పలువురు సెలబ్రిటీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగులో ప్రసారమైన ఓ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న నటితో పాటు తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన మరో నటితో కేపీ చౌదరి 100ల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు బయటపడింది.
KP Chowdhary arrested in Drugs Case : అయితే ఆయా కాల్స్‌పై విచారించిన సమయంలో కేపీ చౌదరి నోరు మెదపలేదని సమాచారం. 12 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 12 మందిలో బడా బాబుల పేర్లు, పలువురు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలించారు. అతని బ్యాంకు ఖాతాలో 11 అనుమానస్పద లావాదేవీలున్నట్లు పోలీసులు గుర్తించారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగోర్ ప్రసాద్ తదితరులు తన వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
అసలేం జరిగింది : ఖమ్మం జిల్లాలోని బోనకల్‌కు చెందిన కబాలి నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరిని కొకైన్ విక్రయిస్తూ పోలీసులు పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అతని వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, రూ.2.05 లక్షల నగదు, 4 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీని విలువ రూ.78 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. 2016లో ఉద్యోగం మానేసి.. సినిమాలపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ దందాలోకి దిగాడు. డ్రగ్స్ ముఠాతో చేరి.. డ్రగ్స్ సరఫరా చేస్తూ హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిపోయాడు.
ఇవీ చదవండి :