సముద్రంలో మత్స్యకారులకు దొరికిన డ్రోన్ Drone found floating in water in AP: వారంతా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి చేపలను పట్టి జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే వారికి సముద్రంలో దూరంగా వారికి కొత్త వస్తువు కనబడింది. అది గమనించిన మత్య్సకారులు మొదట దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. ఆ తరువాత ధైర్యం చేసి దగ్గరకు వెళ్లగా.. అది డ్రోన్‌గా గుర్తించారు. వెంటనే సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందించారు. అనంతరం ఆ డ్రోన్‌ని ఒడ్డుకు చేర్చారు. మెరైన్ సీఐ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరప్రాంత మత్స్యకారులకు వైమానిక రక్షణ దళ డ్రోన్ చిక్కింది. మూలపేట సమీపంలో సముద్రంలో తేలుతున్న విమానాన్ని పోలి ఉండే ఈ డ్రోన్‌ను భావనపాడు జెట్టీకి చేర్చి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్టేషన్‌కు సమాచారం అందించారు. 9 అడుగుల పొడవు, 111కిలోల బరువున్న ఈ డ్రోన్‌పై బన్సీ టార్గెట్ 8081 అని ఆంగ్లంలో ఉండగా.. జనవరి 28, 2023 అని మార్కర్‌తో రాసి ఉంది. దీన్ని భావనపాడు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.
వైమానిక పరిశోధనల్లో భాగంగా టార్గెట్ డ్రోన్‌గా ప్రయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీని పైభాగంలో ప్యారాచూట్ ఉంది. ప్రయోగ సమయంలో విఫలమై తీరానికి చేరుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదని, స్వదేశానికి చెందిన డ్రోన్‌గా ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని మెరైన్ సీఐ జి.దేవుళ్లు తెలిపారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామన్నారు.
'భావనపాడు దగ్గరలోని సముద్రంలోకి మత్య్సకారులు నిన్న చేపల వేటకు వెళ్లారు. ఈ డ్రోన్‌ను వారు సముద్రంలో గమనించారు. దాని గురించి మత్య్సకారులు.. మత్స్యశాఖకు చెందిన అధికారులతో పాటు మాకు సమాచారంఅందించారు. వెంటనే మేము అక్కడికి వెళ్లాము. వారి వద్ద నుంచి ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిన విషయంలో స్పష్టత లేదు. విదేశాలకు చెందినది కాదనుకుంటున్నాం. నేవీ, రక్షణ అధికారలకు సమాచారం ఇచ్చాం. త్వరలో వారు వచ్చి పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తాం.'-జి.దేవుళ్లు, మెరైన్ సీఐ
ఇవీ చదవండి: