తెలంగాణ

telangana

ETV Bharat / state

GHMC drainage: గాడితప్పిన డ్రైనేజీ వ్యవస్థ.. కార్మికులను మింగేస్తున్న అధికారుల ఉదాసీనత - డ్రైనేజీ వ్యవస్థ.

రాజధానిలో తమ పరిధిలోని మురుగునీటి వ్యవస్థను తీరిదిద్దడంలో హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) చేతులెత్తేసింది. ఫలితంగా బల్దియాలో విలీనమైన దాదాపు 12 పూర్వ పురపాలక సంఘాల పరిధిలో లక్షలమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలను సంస్కరించపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో మురుగు రోడ్ల మీదకు వస్తోంది. గాడిలో పెట్టాల్సిన జోనల్‌ కమిషనర్లు ఇది తమ పని కాదన్ననట్లు వ్యవహరిస్తున్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మురుగు డ్రైన్లలో కార్మికులతో పూడిక తీయిస్తుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

drinage system problems in hyderabad
drinage system problems in hyderabad

By

Published : Aug 5, 2021, 10:32 AM IST

నిజాం కాలంలోనే భాగ్యనగరంలో చక్కటి మురుగు, వరదనీటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చిన కాలనీల్లో మురుగుకు, వర్షం నీటి కోసం రెండు వ్యవస్థలను ఏర్పాటు చేయలేదు. దీంతో అక్కడ మురుగునీటి కాలువలను వర్షం నీరు లాగే నాలాల్లోకి కలిపేశారు. పురపాలికల విలీనం తర్వాత ఆ ప్రాంతాల్లో బల్దియా మురుగు వ్యవస్థను అభివృద్ధి చేయలేదు. నగరంతోపాటు ఈ 66 డివిజన్లలో మురుగునీటి వ్యవస్థను పనులు కొద్ది సంవత్సరాల కిందట జలమండలికి ప్రభుత్వం అప్పగించింది. అప్పుడు కాస్త పరిస్థితి మెరుగుపడినా మళ్లీ జీహెచ్‌ఎంసీకే ఇవ్వడంతో గాడితప్పింది.

ప్రమాదం జరిగిన మ్యాన్‌హోల్‌

భారీ అవినీతి. .

మ్యాన్‌హోల్‌ పూడికతీత పనుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. గుత్తేదారులకు ఈ పనులను అప్పగిస్తున్నారు. చాలా చోట్ల పూడిక తీయకుండానే బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో గుత్తేదారులకు కొంతమంది కిందిస్థాయి అధికారులు, కొన్ని చోట్ల కార్పొరేటర్లు కూడా తోడుగా నిలుస్తున్నారు. నిబంధనల ప్రకారం కార్మికులను డ్రైనేజీలోకి దింపడానికి వీలులేదు. మురుగునీటి భూగర్భ డ్రైన్‌పూర్తిగా మూసి వేయబడి ఉంటుంది. అక్కడక్కడా మ్యాన్‌హోల్స్‌ ఉంటాయి. వీటి మూతలను తొలగించి పూడిక మట్టిని తీయాల్సి ఉంది. డ్రైనేజీలో ప్రమాదకర విషవాయువులు ఉంటాయి. దీంతో పూడిక తీతలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బల్దియా దగ్గర 60 వరకు జెట్టింగ్‌ మిషన్లు వినియోగించకుండా కార్మికులకు లోపలికి దింపి పూడిక తీయిస్తోంది. దీనివల్లే మహానగరంలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఇలానే పనులు చేపట్టిన గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు.

అసలు జరిగిందిదీ..

జులైలో కురిసిన వర్షాలకు బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లో మ్యాన్‌హోళ్లు పొంగుతున్నాయి. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు మ్యాన్‌హోల్‌లో పూడిక తీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. సాహెబ్‌నగర్‌ పద్మావతి కాలనీ నుంచి, హరిహరపురం వరకు రూ.12 లక్షల నిధులతో గుత్తేదారుకు బకెట్‌ క్లీనింగ్‌ పనులు అప్పగించారు. మంగళవారం పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనుల్లో నిబంధనలను పాటించకుండా పనులు చేపట్టడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

సహాయక చర్యల్లో డీఆర్‌ఎఫ్‌ బృందం

కొనసాగుతున్న సహాయక చర్యలు

మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన వ్యక్తి జాడ 24 గంటలు దాటినా లభించలేదు. బుధవారం అన్ని శాఖల అధికారులు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సంఘటన స్థలంలోనే ఉండటంతో రాత్రి వరకు నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగాయి. సీసీ రోడ్డు తవ్వి, లోపల ఉన్న పైపులను వెలికి తీస్తున్నారు. అగ్నిమాపక సహాయంతో పైపుల్లో ప్రెషర్‌తో నీటిని పంపించే పనులు చేపడుతున్నారు. ఒక మ్యాన్‌హోల్‌ నుంచి మరో మ్యాన్‌హోల్‌ వరకు తవ్వేందుకే దాదాపు 12 గంటల సమయం పడుతుంది.

గుత్తేదారుపై కేసు

ఈ ఘటనకు గుత్తేదారు నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో వనస్థలిపురం పోలీసులు గుత్తేదారు స్వామిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

  • బల్దియాలో విలీనమైన మున్సిపాలిటీలు 12
  • వాటి పరిధిలోని ప్రస్తుత డివిజన్లు 66
  • అక్కడి మురుగు పైపులైన్ల పొడవు 3600కి.మీ.
  • వాటిపై ఉన్న మ్యాన్‌హోల్స్‌ 3.30లక్షలు
  • ఏటా నిర్వహణకు చేస్తున్న వ్యయం102రూ. కోట్లు

తప్పు తమది కాదంటూ..
భర్త శివ మృతదేహం వద్ద విషణ్ణ వదనంతో రాజేశ్వరి

మురుగునీటి డ్రైనేజీలో మనుషులు దిగి పనులు చేయకూడదు. రాత్రిపూట పని చేయకూడదు. వనస్థలిపురం ప్రాంతంలో ప్రమాదం జరిగినచోట ఈ రెండు నిబంధనలను ఉల్లంఘించారు. అర్ధరాత్రి కార్మికులను 600 డయా పైపులోనులో 15 అడుగుల కిందికి దింపి పని చేయించారు. గుత్తేదారుల నిర్లక్ష్యమైనా కూడా కార్మికులపైనే తప్పు నెట్టేసి అధికారులు గుత్తేదారున్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు రేగుతున్నాయి. తాజాగా 66 డివిజన్లలో మురుగునీటి వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతను జలమండలికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడైనా ఇక్కడ పరిస్థితి మారాలని అనేక మంది కోరుతున్నారు.


సమయం గడిచినా సహాయక చర్యలు తీసుకోలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్‌, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు.

కాంగ్రెస్‌, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తోపులాట

మాకు సంబంధం లేదు..

‘‘కూలీల మృతికి గుత్తేదారు నిర్లక్ష్యమే కారణం. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ పని చేపట్టారు. దురదృష్టకర ఘటనతో జీహెచ్‌ఎంసీకి సంబంధం లేదు. గుత్తేదారుపై తగు చర్యలు తీసుకుంటాం.’’ - బల్దియా

ఇదీ చూడండి:

Suicide: కుంకుమ భరణి చేజారింది.. ఆయుష్షు తీరిందని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details