pests to neem tree: తీపి, చేదు వంటి షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి. వచ్చే నెల 2న తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. కానీ రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా లక్షలాది వేపచెట్లు పూర్తిగా ఎండిపోయి కనిపిస్తున్నాయి. గత ఆరు నెలలుగా తెగుళ్లు, వైరస్‌లతో ఎండిపోయిన వాటిలో చాలా వాటికి ఇంకా కొత్త చిగురు రాలేదు. సేంద్రియ ఎరువు వేసి, నీరు పెట్టి, తెగుళ్ల నివారణకు రసాయనాలను పిచికారీ చేస్తే తిరిగి కోలుకుంటున్నట్లు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలో ఇప్పటికే తేలింది. కానీ పూర్తిగా ఎండిపోతే ఉగాదికల్లా వేపపూత వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టేనని శాస్త్రవేత్తలు తెలిపారు.
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఒక వేళ వేపపూత వచ్చినా ఉగాది పండుగ సమయంలో కోసుకునే సమయంలో ఆ చెట్టుకు తెగులు ఉన్నదా లేదా గుర్తించాలన్నారు. తెగులు ఉంటే శిలీంద్రం తెల్ల జిగురులాగా అక్కడక్కడా కనిపిస్తుందని అలా ఉన్నట్లయితే ఆ వేపపూతను గోరువెచ్చని నీటిలో కాసేపు నానబెట్టి శుభ్రం చేసి ఉగాది పచ్చడిలో కలిపి తింటే మంచిదని వివరించారు. వేపచెట్లకు పురుగు, శిలీంద్రం ఆశించిన తరవాత వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి చాలా ప్రాంతాల్లో ఎవరూ ముందుకు రాలేదని తమ పరిశోధనలో గుర్తించినట్లు చెప్పారు.