ఆఫ్రికా దేశాల నుంచి దుబాయి మీదుగా హైదరాబాద్‌కు ముఠాలు మాద కద్రవ్యాలు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నాయి. మరికొన్ని అంతర్జాతీయ ముఠాలు.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలకు హెరాయిన్ సరఫరా చేసేందుకు హైదరాబాద్‌ను వారధిగా ఎంచుకుంటున్నాయి. కొన్ని దేశాల నుంచి పాశ్చాత్య దేశాలకు రవాణా అయ్యే ప్రతి వస్తువు మీద అనుమానం ఉంటుంది. ప్రయాణికులను అణువణువు తనిఖీ చేస్తారు. కానీ భారత్ నుంచి వెళ్లేవారిపై అంక్షలు కాస్త తక్కువ. దీన్ని అదునుగా చేసుకొని అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు.. హైదరాబాద్ మీదుగా ఇతర దేశాలకు హెరాయిన్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడుతున్నాయి. మరికొన్ని ముఠాలైతే హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు చేరవేసి.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులు నిఘా పెట్టి మాదకద్రవ్యాలు సరఫరా చేసే ముఠాల ఆటకట్టిస్తున్నారు.
రెండేళ్లలో 35 కిలోల హెరాయిన్..: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సమాచార వ్యవస్థను పెంపొందించుకున్నారు. పలు రూపాల్లో తరలిస్తున్న హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. రెండేళ్ల వ్యవధిలో శంషాబాద్ విమానాశ్రయంలో 35 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఇందులో డీఆర్ఐ 20.35 కిలోలు.. మిగతా 15 కిలోలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.250 కోట్లు ఉంటుందని అంచనా. డీఆర్ఐ అధికారులు 5 కేసులు నమోదు చేసి పలువురు విదేశీయులను అరెస్ట్ చేశారు. వీరిలో ఘనా, నైజీరియా, జాంబియా దేశాలకు చెందిన వాళ్లున్నారు. ఓ కేసులో 2.2 కిలోల హెరాయిన్ తరలిస్తున్న వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టడంతో న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్షన్నర జరిమానా విధించింది. మిగతా కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయి.