తొలి విడతలో 2డీజీ ఔషధం పది వేల పొట్లాలను అందుబాటులోకి తెస్తున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు. అలాగే ఇళ్లలో వినియోగించేందుకు వీలుగా చిన్న ఆక్సిజన్ సిలిండర్లను మరో వారంలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
కొవిడ్ చికిత్సలో కొత్త మందు.. 2డీజీ ఔషధం నేడే విడుదల
కంటికి కనిపించని కొవిడ్ వైరస్ కట్టడికి ఏడాది కాలంగా శ్రమిస్తున్న రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శుభవార్త తెలిపింది. కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2డీజీ ఔషధాన్ని సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఔషధాన్ని గతంలో క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుందని అప్పట్లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే సూత్రాన్ని కొవిడ్ వైరస్‌కూ అన్వయించుకొని పరిశోధన ప్రారంభించారు. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని.. ఫలితంగా శరీరంలో కరోనా వ్యాప్తి కూడా ఆగుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. తొలి విడతలో 2డీజీ ఔషధం పది వేల పొట్లాలను అందుబాటులోకి తెస్తున్నట్లు డీఆర్‌డీవో ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు. అలాగే ఇళ్లలో వినియోగించేందుకు వీలుగా చిన్న ఆక్సిజన్ సిలిండర్లను మరో వారంలో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
చిన్న ఆక్సిజన్ సిలిండర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి..
పది లీటర్ల సెల్ఫ్ రెగ్యులేటరీ ఆక్సిజన్ సిలిండర్లు ఇవి. ఎలక్ట్రానిక్ యూనిట్, ఎస్‌పీవో-2 రీడింగ్, మాస్క్‌తో కూడి ఉంటుంది. ఆసుపత్రి పడక అవసరం లేకుండా వీటిని ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. వారం రోజుల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం.
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధం విడుదలపై మీ ప్రణాళిక ఏమిటి?
తొలి విడతగా 10 వేల పొట్లాలను(సాచెట్ల) సోమవారం అందుబాటులోకి తెస్తున్నాం. కేంద్ర రక్షణ, వైద్యఆరోగ్యశాఖ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హర్షవర్ధన్‌లు దిల్లీలో వీటిని విడుదల చేయనున్నారు. రెండో విడతలో భాగంగా మరిన్ని ఈ నెల 27, 28 తేదీల్లో విడుదల చేయనున్నాం. జూన్‌లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తెలిపింది.
మే 1నే డీసీజీఐ అనుమతిచ్చినా మార్కెట్లోకి రావడానికి ఎందుకు ఆలస్యమవుతోంది?
ముడి పదార్థాలు సమకూర్చుకోవడం దగ్గర్నుంచి పొట్లాలను మార్కెట్లోకి తీసుకొచ్చే వరకు ఎంతలేదన్నా నెల రోజులు పడుతుంది. అనుమతి వచ్చాకే ఉత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి కొంత సమయం పడుతుంది.
ధర ఎంత వరకు ఉండొచ్చు
ఇంకా నిర్ణయించలేదు. ఉత్పత్తి సంస్థ ప్రకటిస్తుంది. ఒక్కో పొట్లం రూ.600 వరకు ఉండే అవకాశం ఉంది.
ఔషధం పూర్తిగా సురక్షితమేనా? 2డీజీ గురించి పూర్తి సమాచారం ప్రజాక్షేత్రంలో అందుబాటులో లేదనే విమర్శలొస్తున్నాయి?
దేశం మొత్తం కొవిడ్‌పై పనిచేసే ఔషధం కోసం ఎదురు చూస్తున్న దశలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన 2డీజీని అత్యవసరంగా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. వేర్వేరు దశల్లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే అనుమతులొచ్చాయి. గతంలోనూ రేడియేషన్‌కు 2డీజీని అభివృద్ధి చేసినప్పుడు ఫేజ్-3 ట్రయల్స్ వరకు వెళ్లాం. అప్పుడు, ఇప్పుడు 2డీజీతో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. ప్రజాక్షేత్రంలో సమాచారం అందుబాటులో ఉంచేందుకు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం.
ఆక్సిజన్ ప్లాంట్లను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు?
పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని మొదట ప్రభుత్వం నిర్ణయించినా ఈ సంఖ్య ఇప్పుడు పెరిగింది. అదనంగా మరో 349 ప్లాంట్లు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా జిల్లాకొకటి, పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ఉంటుంది.
డీఆర్‌డీవో 70కిపైగా సాంకేతికతలను వందకుపైగా ప్రైవేటు సంస్థలకు బదలాయించింది. అయినా ఇప్పటికీ వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది? పలు పరికరాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఎక్కడుంది లోపం?
మాస్క్‌ల దగ్గర్నుంచి, పీపీఈ కిట్ల వరకు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతున్నాయి. వెంటిలేటర్లు సైతం 50 వేలకు పైగా అందుబాటులో ఉన్నాయి. మా నుంచి సాంకేతికత తీసుకున్న చాలా సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఇవి మార్కెట్లో కనిపించకపోవడానికి మార్కెటింగ్ లోపాలు కారణమై ఉండొచ్చు. అన్నింటినీ ఒకసారి పర్యవేక్షించాలి. ఒకసారి సాంకేతికత బదలాయించాక ఎక్కువగా కొత్త వాటిపై దృష్టి పెడుతుంటాం. కొవిడ్ వైరస్ కట్టడికి అవిశ్రాంతంగా పనిచేస్తూ 2డీజీ డ్రగ్ అభివృద్ధికి కృషిచేసిన శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా.
ఇదీ చదవండి: దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు