DRDO Chairman: దేశంలో మరిన్ని యువ శాస్త్రవేత్తల ల్యాబ్‌లను ఏర్పాటు చేసే ఆలోచన ఉందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఛైర్మన్, రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త సాంకేతికతలపై పరిశోధనల వేగం పెంచేందుకు అవసరమైనచోట వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో రక్షణ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తే తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. రక్షణ రంగంలో అంకురాలకు అపార అవకాశాలున్నాయన్నారు. కొత్తగా దీర్ఘశ్రేణి క్షిపణులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, అధునాతన రాడార్లు, సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్‌లో ప్రైవేట్‌కు 25 శాతం నిధులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సతీశ్‌రెడ్డితో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖి మాట్లాడింది.
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటు ఆలోచన ఉందా?
దేశంలో అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలను డీఆర్‌డీవో ప్రోత్సహిస్తోంది. వాటికి టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ ఇస్తున్నాం. తెలంగాణలో టీ-హబ్ ఇంక్యుబేషన్‌పై ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ప్రత్యేకంగా రక్షణ అంకుర కేంద్రం ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి.
యుద్ధాల్లో డ్రోన్లు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి? వాటిని కూల్చే, ఎదుర్కొనే పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి?
యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఇప్పటికే అభివృద్ధి చేసి ప్రదర్శించాం. సైన్యం ఆర్డర్ ఇవ్వడంతో ప్రైవేట్ సంస్థలకు సాంకేతికతను బదిలీ చేశాం. ప్రాధాన్య క్రమంలో విమానాశ్రయాలు, సెక్యూరిటీ సంస్థలకు సరఫరా చేశాక ఎగుమతి చేసే ఆలోచనా ఉంది. వీటిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
డీఆర్‌డీవో చేస్తున్న కొత్త పరిశోధనలు ఏమిటి?
ప్రయాగ్‌రాజ్, వింధ్యాచలం మధ్య 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం క్వాంటమ్ కీ డ్రిస్టిబ్యూషన్ లింక్‌ను విజయవంతంగా పరీక్షించాం. చాలా తక్కువ దేశాలు దీన్ని అభివృద్ధి చేశాయి. వాటి సరసన మనం చేరాం. హైపర్ ఎలక్ట్రో మాగ్నటిక్స్ సాంకేతికతపై పనిచేస్తున్నాం. అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టాం. అడ్వాన్స్‌డ్ ప్రొపెల్షన్, స్టెల్త్ టెక్నాలజీలు, సైబర్, కృత్రిమ మేధపై పరిశోధనలు సాగుతున్నాయి.
ఎలాంటి కొత్త ఆయుధ వ్యవస్థల అభివృద్ధిపై డీఆర్‌డీవో దృష్టి పెట్టింది?
కొత్త రాడార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టెస్టింగ్ కొనసాగుతోంది. సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థను పరీక్షిస్తున్నాం. అధునాతన సోనార్ వ్యవస్థ, దీర్ఘశ్రేణి క్షిపణులు శ్యామ్, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ట్యాంకు విధ్వంసక క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాం. పలు కొత్త క్షిపణుల పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఆర్ అండ్ డీ బడ్జెట్ నుంచి ప్రైవేట్ సంస్థలకు 25 శాతం నిధులను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
ప్రైవేట్ సంస్థల డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సామర్థ్యాలను పెంపొందించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. పరిశ్రమలతో పాటు విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు పెంచి అధునాతన పరిశోధనలకు ఊతమివ్వాలనేది ప్రధాని సంకల్పం. ఏయే వ్యవస్థలపై పనిచేయగలరో గుర్తించే పనిలో నిమగ్నమై ఉన్నాం. ఇప్పటికే కొన్ని గుర్తించాం. ఇది పూర్తయ్యాక పరిశ్రమలకు అప్పగించి నిధులు మంజూరు చేస్తాం. రక్షణశాఖ ఆర్ అండ్ డీలో 25 శాతం అంటే దాదాపు రూ.1,300 కోట్ల వరకు ఉంటుంది. దేశంలో పరిశ్రమలను మరింతగా ప్రోత్సహించి డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సామర్థ్యాలను పెంచే దిశగా నిధుల కేటాయింపు ఉంటుంది. డీఆర్‌డీవో ఒక సాంకేతికత అభివృద్ధి చేస్తే.. పరిశ్రమల్లో దానికి తగ్గట్టుగా డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ జరగాలని కోరుకుంటున్నాం. అందరూ కలిసి దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధానమైన లక్ష్యం.
అవసరమైతే ఎస్‌పీవీలను ఏర్పాటు చేయాలనే ప్రస్తావన వచ్చింది. వీటి పాత్ర ఎలా ఉండబోతోంది?
పెద్ద, విస్తృతంగా మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉన్న వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)లను ఏర్పాటు చేసి ప్రభుత్వం, ప్రైవేట్ కలిసి పనిచేస్తాయి. బ్రహ్మోస్ తీసుకుంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. డీఆర్‌డీవోతో కలిసి పనిచేస్తుంది. అత్యాధునిక యుద్ధ విమానం తయారు చేయబోతున్నాం. దీనికి సంబంధించి డీఆర్‌డీవో, హెచ్‌ఏఎల్, ప్రైవేట్ సంస్థలు కలిసి పరిశోధనలు చేసేందుకు ఎస్‌పీవీతో ముందుకెళ్లాలనే ఆలోచనలున్నాయి. ఒక కొత్త యుద్ధ ట్యాంకు తయారీకి ఎస్‌పీవీ ఏర్పాటు చేసి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రైవేట్ సంస్థల్లోలా నిర్ణయాలు, పని వాతావరణంలో వెసులుబాటుతో సులభతరం, సరళతరంగా ముందుకు సాగేలా ఇది పనిచేస్తుంది. ఎస్‌పీవీలకు పరిశ్రమలే నాయకత్వం వహిస్తాయి.
మన దేశానికి రష్యాతో పలు రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆ దేశం అంక్షలు ఎదుర్కొంటోంది. ఆ ప్రభావం మనపై ఉండబోతోందా?
ఇప్పుడే చెప్పడం కష్టం. కొద్దిరోజులు వేచిచూసిన తర్వాతే దీనిపై మాట్లాడగలం. రక్షణ ఉత్పత్తులకు సంబంధించి ఆత్మనిర్భర్ భారత్‌లో సాధ్యమైనంత వరకు దిగుమతులను తగ్గించుకునే దిశగా కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలిస్టిక్ మిసైల్స్ డిఫెన్స్ పరిశోధనలు మన దేశంలో జరుగుతున్నాయి. యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్, యాంటీ మిసైల్ కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయి. ఇందులో మనం సఫలమయ్యాం. మరింత స్వావలంబన దిశగా కృషి జరగాల్సి ఉంది.
యువ శాస్త్రవేత్తల ల్యాబ్‌లు మరిన్ని ఏర్పాటు చేయబోతున్నారా?
దేశంలో 5 యువ శాస్త్రవేత్తల ల్యాబ్‌లను గతంలో ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లోనూ ఒకటి ఉంది. కృత్రిమ మేధ, క్వాంటమ్ టెక్నాలజీస్, కాగ్నిటివ్ టెక్నాలజీస్, స్మార్ట్ మెటీరియల్స్‌పై పరిశోధనలు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. వీటిని కొనసాగిస్తూనే మరిన్ని కొత్త సాంకేతికతలపై పనిచేసేందుకు యువ శాస్త్రవేత్తల ల్యాబ్‌లు మరిన్ని రాబోతున్నాయి. అవసరాన్నిబట్టి వాటిని ఏర్పాటు చేస్తాం.
ఇదీ చదవండి: