Drainage works Neglected By The Authorities In Karimnagar :కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ముఖ్యమంత్రి హామీ కింద అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.132 కోట్లతో మూడు నెలల క్రితం ప్రారంభించి, సగం పనులు చేసి వదిలేశారు. అధికారులు సైతం ఒత్తిడి పెంచకపోవటంతో నిర్లక్ష్యం మొదలైంది. ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ గుత్తేదారు ఆవైపు కన్నెత్తి చూడట్లేదని వాపోతున్నారు. నగరంలోని కట్టరాంపూర్, కోతిరాంపూర్, లక్ష్మీనగర్, రేకుర్తి, అశోక్‌నగర్, మంకమ్మతోట, కిసాన్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ పనుల కోసం తవ్వి వదిలేశారు. కొన్ని చోట్ల అడ్డంకులుండగా మిగతా ప్రాంతాల్లో నత్తనడకన సాగుతున్నాయి. మురుగు కాల్వలు వంకర టింకరగా నిర్మించినా పరిశీలించడం లేదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
కరీంనగర్లో నత్తనడకన సాగుతున్న కాల్వల నిర్మాణం
Karimnagar Drainage Pending Issue :నిత్యం రద్దీగా ఉండే వీధులు, దుకాణాల సముదాయాలున్న ప్రాంతాల్లో కాల్వలు, రోడ్లు నిర్మించకుండా వదిలేశారు. ఇళ్ల ముందు మురుగు నిలిచి ఉండటంతో వాసన, దోమల బెడద భరించలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పనుల జాప్యంపై అధికారులు పట్టించుకోకపోవటంతో ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. సంబంధిత ప్రాంతాల ఇంజినీరింగ్ అధికారులు సైతం దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేయర్, ఉన్నతాధికారులు స్పందించి పనుల్లో వేగం పెరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
"మూడు నెలల క్రితం మున్సిపల్ స్మార్ట్ సిటీలో భాగంగా డ్రైనేజ్ కడదామని ప్రారంభించిన కాల్వల తవ్వకం ఇంకా పూర్తి చేయలేదు. రోజువారీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ కాల్వలు తవ్వి పూర్తి చేయకపోవడం వల్ల రాత్రి 8 గంటలకు మూసివేయాల్సిన దుకాణాలు సాయంత్రం 6 గంటలకే బంద్ చేస్తున్నాం. మురుగు నీటి వల్ల దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంది." - స్థానికులు
Drainage works: అధికారుల అలసత్వం... అసంపూర్తిగా డ్రైనేజీ పనులు