తెలంగాణ

telangana

ETV Bharat / state

HYD Drainage System: నత్తనడకన నాలాలపై స్లాబుల నిర్మాణం... భయాందోళనలో స్థానికులు

గ్రేటర్‌ పరిధిలోని ఓపెన్‌ నాలాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు స్లాబ్‌ వేయిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది తప్పించి అమల్లో చిత్తశుద్ధి చూపడంలేదు. బాక్స్‌ నాలాల పూర్తికి భారీ మొత్తంలో నిధులను కేటాయించినా, విడుదల చేయకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలు జలమయమవుతున్నాయి. నిండుగా ప్రవహిస్తున్న నాలాల్లో పలువురు జారిపడిపోయారు. స్థానికులు అప్రమత్తమై బయటకు లాగడంతో బయటపడ్డారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్‌ స్పందించి స్లాబు వేసే పనులను వేగవంతం చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

drinage system
drinage system

By

Published : Sep 9, 2021, 9:11 AM IST

అత్తాపూర్‌ కాంతారెడ్డి నగర్‌ నుంచి సోమరెడ్డి నగర్‌ మీదుగా అతి పెద్ద నాలా ఉంది. నాలుగైదేళ్ల కిందటే స్థానికుల ఒత్తిడి మేరకు స్లాబ్‌ వేశారు. దీని వెంబడి ఉన్న మట్టి రోడ్డును సిమెంట్‌ రోడ్డుగా మార్చారు. ఏడాది కాకుండానే దానిపై గుంతలు పడ్డాయి. నాలా పక్కన రోడ్డును పటిష్ఠంగా నిర్మించకపోవడంతో లోపలి భాగం దెబ్బతింది. కూలితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

బ్లాక్‌ నాలాను గాలికొదిలేశారు

సికింద్రాబాద్‌లో పడ్డ వర్షపు నీటిని బయటకు తీసుకెళ్లే ఓపెన్‌ బ్లాక్‌ నాలా పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడ పిల్లలు పడిపోతారోనని చుట్టుపక్కల నివాసితులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు పొంగి ఒలిఫెంటా వంతెన కింద మోకాలి లోతు నీరు చేరుతోంది. తీవ్ర ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా!

ఓపెన్‌ నాలాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. చుట్టుపక్కల కాలనీల్లో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. పలువురు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు.

జరిగిన ఘటనలు

*రెండేళ్ల కిందట కంట్మోనెంట్‌లోని ఆనంద్‌నగర్‌ కాలనీ వద్ద ఆనందసాయి అనే చిన్నారి ఆడుకుంటూ ఓపెన్‌ నాలో పడిపోయాడు. మూడు కి.మీ. ఆవల మృతదేహం చిక్కింది.

*ఏడాది కిందట సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతున్న సుమేధ అనే బాలిక నేరేడ్‌మెట్‌ క్రాస్‌ రోడ్స్‌ సమీపంలోని కాకతీయనగర్‌ వద్ద ఓపెన్‌ నాలాలో పడి మరణించింది. 3 కి.మీ. తరవాత మృతదేహాన్ని గుర్తించారు.

ప్రభుత్వ హామీలు

*ఈ నాలా పైన స్లాబు వేయిస్తాం.

*నాలుగు కి.మీ. మేర ఉన్న నాలాను వెంటనే బాక్సు నాలాగా మారుస్తాం.

చేసిన పనులు

*రెండేళ్లయినా కల్వర్టుకు ఒక వైపు మాత్రమే గోడ నిర్మించారు. మరోవైపు కట్టెలను కట్టారు. రూ.20 లక్షలతో రెండువైపులా గోడ కట్టే అవకాశమున్నా పట్టించుకోలేదు.

*సుమేధ పడిన చోటు నుంచి 300 మీటర్ల మేర మాత్రమే బాక్సు నాలా కట్టాలని నిర్ణయించారు. రూ.2 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. వంద మీటర్లు కూడా పూర్తి చేయలేదు. దీని వెంబడి అనేక కాలనీలు విస్తరించాయి.

నగరంలో నాలాల స్వరూపమిది

కప్పులేని నాలాల పొడవు 446 కి.మీ.

స్లాబు నిర్మాణ వ్యయం రూ.350 కోట్లు

పొడవు 1221 కి.మీ.

మంజూరైన మొత్తం రూ.280 కోట్లు

నాలుగేళ్లలో వెచ్చించింది రూ.70 కోట్లు

ఇదీ చూడండి:HYDERABAD DRINAGE SYSTEM: రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!

ABOUT THE AUTHOR

...view details