ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని ములకలచెరువు సమీపంలో చెన్నై -హైదరాబాద్ జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యేసువారిపల్లి వద్ద గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొడాలి భాస్కర రావు, ఆయన కుమారుడు ప్రదీప్ 20 ఎకరాల భూమి కొనుగోలు చేసి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు, నీటివసతి, ఇతర అనుకూల పరిస్థితుల కారణంగా డ్రాగన్ ఫ్రూట్ వేయడానికి అనుకూలంగా ఉండడంతో భూమి కొని పంట వేశామని చెబుతున్నారు.
3 సంవత్సరాల క్రితం ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగు ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో పంట దిగుబడి తీశారు. మొదటిసారి ఎకరాకు ఒక టన్ను దిగుబడి వచ్చింది. రెండో సంవత్సరం 2, 3 టన్నులు మూడో ఏడాది 4, 5 టన్నులు.. ఇలా ప్రతి ఏటా.. దిగుబడి పెరుగుతుందని డ్రాగన్ ఫ్రూట్ సాగు రైతు ప్రదీప్ చెబుతున్నారు. మొదటిసారి ఎకరాకు రూ. 6 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మొదటి పంట దిగుబడి మూడు సంవత్సరాలకు వస్తుంది. నాలుగో సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు ఎకరాకు పెట్టుబడి 50 వేలు మాత్రమే అవుతుంది. దిగుబడి ఏడాదికేడాది పెరుగుతూ వస్తుంది. మొదటిసారి పెట్టుబడికి ప్రభుత్వ ఉద్యానవన శాఖ రాయితీ కూడా కల్పిస్తుంది.