IIT Hyderabad Alumni Association: వ్యాక్సిన్లు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఎంతో కీలకమని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల అన్నారు. కొవిడ్ నియంత్రణలో నాసల్ వ్యాక్సిన్ అభివృద్ధి సాధ్యమా? అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ.. అమెరికా కంటే ముందున్నామని స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కృష్ణ ఎల్ల, జపాన్ మాజీ దౌత్యవేత్త హిడాకీ డోమీచీ, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు అజయ్‌చౌదరి, ఓఎన్జీసీ మానవ వనరుల విభాగం డైరెక్టర్ అల్కా మిట్టల్ పాల్గొన్నారు. నాసల్ వ్యాక్సిన్‌తో ఎగువ శ్వాస కోస వ్యవస్థలో వ్యాధినిరోధకశక్తి పెరిగి కరోనాను కట్టడిచేస్తుందని కృష్ణ తెలిపారు. విచ్చలవిడిగా అడవులు నరకడం, పర్యావరణ విధ్వంసం కారణంగా వైరస్‌లు విజృంభిస్తున్నాయని పేర్కొన్నారు.