కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఊపందుకున్నాయి. అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలే చేస్తున్నారు. అయితే, కొన్నిసార్లు ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలాక కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వస్తుండటంతో ఈ టెస్టులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లోని బాలుర వసతిగృహంలో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు చేయగా వార్డెన్, కాపలాదారుతో కలిపి మొత్తం 28 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తర్వాత రోజు వారందరికీ ఆర్టీపీసీఆర్(రివర్స్ ట్రాన్స్కిప్షన్ పాలిమర్ ఐన్ రియాక్షన్) పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విద్యార్థులకు మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. తొలిరోజు యాంటిజన్ పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయిన వారందరికి ఇందులో నెగెటివ్ రావడంతో పరీక్షల కచ్చితత్వం ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా ప్రబలిన తొలినాళ్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షలే నిర్వహించేవారు. వాటి ఫలితాలు వచ్చేసరికి 2-3 రోజులు, కొన్నిసందర్భాల్లో వారంఆగాల్సి వచ్చేది. దీంతో కొవిడ్ బాధితుల ఆరోగ్యం విషమించేది. తదనంతరం ర్యాపిడ్ యాంటిజన్ కిట్లు అందుబాటులోకి రావడంతో తక్కువ సమయంలో ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఏర్పడింది. ఈ రెండు పరీక్షల్లోనూ ముక్కు, గొంతు కలిసేచోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్ శాంపిళ్లను తీసుకుంటారు. యాంటిజన్ పరీక్షల ఫలితాలు 2-3 నిమిషాల్లోనే తెలిసిపోతుండటంతో పాజిటివ్‌గా తేలిన వారికి సత్వరం చికిత్స అందిస్తారు. ఏడాదిగా అన్ని యూపీహెచ్‌సీల్లో ఈ పరీక్షలే ఎక్కువ చేస్తున్నారు. యాంటిజన్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే శరీరంలో వైరస్ జాడ ఉన్నట్లేనని, మళ్లీ ఆర్టీపీసీఆర్ అవసరంలేదని భావించేవారు. ఒకవేళ వైరస్ లక్షణాలు ఉంటూ నెగెటివ్ వస్తే మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవాల్సిందే.
చాలా కారణాలు దోహదం చేస్తాయి:
ర్యాపిడ్ యాంటిజన్‌లో నెగెటివ్ వస్తే...కరోనా లేదని చెప్పలేం. లక్షణాలు ఉన్నప్పుడు అలాంటి వారికి తప్పకుండా ఆర్టీపీసీఆర్ చేయాలి. అందులో కూడా నెగెటివ్ వస్తేనే కొవిడ్ లేదని భావించవచ్చు. అది కూడా 67 శాతమే. యాంటిజన్‌లో పాజిటివ్ వచ్చి.. ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్‌గా తేలితే ఇందుకు చాలా కారణాలు దోహదం చేస్తాయి. యాంటిజన్ కిట్ల నాణ్యత, శాంపిళ్లు సేకరణ, బాధితుల ఆరోగ్య పరిస్థితి, పరీక్షల నిర్వహణ తదితర అంశాలన్నీ ఆధారపడి ఉంటాయి.