లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలన్నీ మూతపడి బోధన సాగడం లేదు. వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి సెమిస్టర్‌ను సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభించేలా అన్ని విశ్వవిద్యాలయాలు నిర్ణయించాయి. ఈ పరిస్థితుల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై సందేహాలు నెలకొన్నాయి. లాక్‌డౌన్ దశల వారీగా ఎత్తివేస్తున్నా.. అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం, ఇతర దేశాల్లో కరోనా ప్రభావం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది.
కొన్ని దేశాల వారికే అవకాశం!
ఏటా నగరంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులు వస్తుంటారు. ఉస్మానియా, జేఎన్‌టీయూ, హెచ్‌సీయూ, ఇఫ్లూ, మనూలో ప్రవేశాలు తీసుకుంటుంటారు. దాదాపు 3,350 మంది విదేశీ విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వివిధ దేశాల భాగస్వామ్యంతో భారత విదేశాంగ శాఖ, మానవవనరుల అభివృద్ధి శాఖ సంయుక్తాధ్వర్యంలో ఉపకార వేతనాలు అందిస్తోంది. ఐసీసీఆర్, ఎస్‌ఐపీ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా విదేశీ విద్యార్థులు మన వర్సిటీలకు వచ్చి చదువుకునేందుకు ప్రోత్సహిస్తోంది. నగరంలో అధికంగా ఓయూలో 2,800 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా సుమారు 700 మంది విద్యార్థులు ఆయా వర్సిటీలకు వస్తుంటారు. ప్రతిసారి మే 31లోపు దరఖాస్తు చేసుకుంటే జులైలో ప్రవేశాలు కల్పించేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యా క్యాలెండర్ మారిన క్రమంలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలకు ఎంతవరకు సాధ్యమన్నది అనుమానంగా మారింది. విదేశాంగ శాఖ సైతం స్పష్టత ఇవ్వలేదు. ఈ ఏడాది కొన్ని దేశాల విద్యార్థులకే అవకాశం కల్పించే వీలుందని ఓయూ ఆచార్యులు చెబుతున్నారు.