గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా రెండు పడకల ఇళ్ల (Double Bedroom Houses) నిర్మాణం మొదలుపెట్టాలని నాలుగేళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 40 మురికివాడలను ఖాళీ చేసి అక్కడ 8898 ఇళ్లను అపార్టుమెంట్ల రూపంలో నిర్మించాలని తలపెట్టారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కూడా ఇలానే 91,102 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటిలో దాదాపు 65 వేల ఇళ్ల నిర్మాణాన్ని ఏడాది కిందటే జీహెచ్‌ఎంసీ అధికారులు పూర్తి చేశారు. వీటన్నింటికి జలమండలి అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.
ఇదేరీతిలో విద్యుత్తు సంస్థ ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు సౌకర్యాలను కల్పించాలంటే దాదాపు రూ.500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆ నిధులు విడుదల చేయకపోవడంతో అపార్టుమెంట్ల సముదాయాలు అలంకారప్రాయంగా మారాయి. మరోవైపు నిర్మాణం పూర్తయిన ఇళ్లలో కొందరు సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల అపార్టుమెంట్ గేట్లు పగులగొట్టి లోపలికి వెళ్లి గంజాయి సేవిస్తున్నారు. మరికొంతమంది వీటిని పేకాట స్థావరాలుగా మార్చారు. మరికొందరు వ్యభిచార కూపాలుగా మారుస్తున్నారు.
మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు
వ్యయం తీరిది | (రూ.కోట్లలో) |
ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సిన తొలి అంచనా వ్యయం | 8598.58 |
స్టీలు పెరగడం వల్ల అదనపు భారం | 500 |
ఇతర శాఖలు చేయాల్సిన వ్యయం | 616.01 |
మొత్తం ప్రాజెక్టుకయ్యే వ్యయం | 9714.59 |
ఇప్పటివరకు సర్కార్ కేటాయించిన మొత్తం | 6256.71 |
ఇంకా విడుదల చేయాల్సిన మొత్తం | 3457.88 |