TS 2BHK Inauguration in Hyderabad : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల ద్వారా పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కమలానగర్ ఎస్.పి.ఆర్ హిల్స్ లో రూ. 1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రజల సమస్యలను సరైన నాయకుడు మాత్రమే గుర్తించి దాని పరిష్కారానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రెండు పడక గదుల ఇళ్లను హైదరాబాద్‌లో లక్షకు పైగా నిర్మిస్తున్నామని తెలిపారు.
ఒక్కో ఇంటికి రూ.8లక్షలకు పైనే ఖర్చు:కమలానగర్లో రెండు బ్లాక్‌లలో 7 లిఫ్ట్‌లతో మొత్తం 210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మొత్తం రూ. 16 కోట్ల 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టారన్నారు. రూ.157.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కాలనీకి 100 కె.ఎల్ లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటుగా 15 షాపులు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లుకు రూ. 8,50,000 వ్యయం చేయడం జరిగిందన్నారు. 89 మంది లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేపట్టామని, మిగతా 121 మందికి స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారులు పరిశీలించి త్వరలోనే అందజేస్తామని తెలిపారు.