Second Phase Of Dost Seats Allotment Started In Telangana : రాష్ట్రవ్యాప్తంగా దోస్త్ ద్వారా 889 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోని 512 కోర్సుల్లో 3,56,258 సీట్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో ఇవాళ 73,220 మందికి డిగ్రీ సీట్లను కేటాయించినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. మొదటి విడతలో 1,05,935 మంది దోస్త్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వారిలో కేవలం 78,212 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లను నేటి నుంచి ప్రారంభించారు.
మరోవైపు తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 4,992 మందికి ఏకంగా సీట్లు దక్కనే లేదు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిలో 53,032 మందికి మొదటి కోరుకున్న సీటే దక్కింది. ఈ ఏడాది కూడా కామర్స్‌లో చేరేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి కనబరిచారు. కేటాయించిన సీట్లలో 45.41 శాతం అంటే 33,251 మంది కామర్స్ విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత లైఫ్ సైన్సెస్‌లో 16,434 మంది.. భౌతిక శాస్త్రంలో 13,468.. ఆర్ట్స్‌లో 7,771.. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంజినీర్, మెషీన్ లెర్నింగులో 1,995 మంది విద్యార్థులు సీటు పొందారు.