తెలంగాణ

telangana

ETV Bharat / state

RICE ATM: ఈ ఏటీఎమ్‌ డబ్బులు కాదు బియ్యం ఇస్తుందండోయ్..! - తెలంగాణ రైస్ ఏటీఎం

హైదరాబాద్‌ నగరంలో ఎటువైపు వెళ్లినా ఏటీఎమ్‌లు కనిపిస్తాయి. కానీ ఎల్బీనగర్‌ ప్రాంతంలోని రాక్‌టౌన్‌ కాలనీలో మాత్రం వాటికి భిన్నమైన ఏటీఎమ్‌ ఒకటి దర్శనమిస్తుంది. ఈ ఏటీఎమ్‌లో బియ్యం లభిస్తాయి. వీటిని తీసుకోవడానికి ఎలాంటి కార్డులూ అక్కర్లేదు. ఆఖరికి తెల్ల రేషన్‌ కార్డు కూడా. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చడానికి నగరానికి చెందిన దోసపాటి రాము ఏర్పాటుచేసిందే ఈ ‘రైస్‌ ఏటీఎమ్‌’.

dosapati-ramu-started-rice-atm-in-hyderabad
ఈ ఏటీఎమ్‌ డబ్బులు కాదు బియ్యం ఇస్తుందండోయ్..!

By

Published : Jul 25, 2021, 11:17 AM IST

కొవిడ్‌ కారణంగా గతేడాది లాక్‌డౌన్‌ విధించిన సమయమది... చికెన్‌ కొనేందుకు దుకాణానికి వెళ్లారు దోసపాటి రాము... అక్కడ లక్ష్మమ్మ అనే ఆమె ఏకంగా 20 కిలోల చికెన్‌ కొనడం చూశారు. రాము ఇంటికి దగ్గర్లో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ భార్య ఆమె. లాక్‌డౌన్‌ సమయంలో అంత చికెన్‌ ఎందుకు అవసరమైందో అర్థం కాక, అదే విషయాన్ని లక్ష్మమ్మని అడిగితే... ‘వలస కూలీలకు భోజనం పెడుతున్నాం. భాష తెలిసిన నాకు ఎవరైనా అప్పు ఇస్తారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పనులూ లేవూ, అప్పూ దొరకదూ’ అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలు రాముని ఆలోచనల్లో పడేశాయి. వెంటనే స్నేహితులతో కలసి వలస కార్మికుల ఆకలి తీర్చే ప్రయత్నం మొదలుపెట్టారు. తన అపార్ట్‌మెంట్‌ బయట రైస్‌ ఏటీఎమ్‌ని ఏర్పాటుచేసి ఎవరైనా అక్కణ్నుంచి బియ్యం, కూరగాయలూ, పప్పూఉప్పులూ, పాలూ ఉచితంగా తీసుకోవచ్చని చెప్పారు.

రోజూ 100-150 మంది వచ్చి ఉచితంగా సరుకులు తీసుకువెళ్లేవారు. మరోవైపు వలస కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేస్తూనే... కొన్ని వందలమందిని వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.

వందల మందికి ఉపాధి...
లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా రోజూ ఉదయాన్నే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లూ, కూలీలూ సాయం కోరుతూ రాము ఇంటి దగ్గరకు వచ్చేవారు. దాంతో సామాన్యుల కష్టాలు తీరిపోలేదని బియ్యం పంపిణీని కొనసాగిస్తూనే సాయం కోరి వచ్చేవారికి చేయూతనిచ్చేవారు. రైస్‌ ఏటీఎమ్‌ ప్రారంభించి ఏడాదిపైనే అయింది. నెల వ్యవధిలో వచ్చిన వాళ్లే మళ్లీ రావడాన్ని గమనించారు రాము. దాంతో వారికి జీవనోనోపాధి కల్పించడమే ఉత్తమమని భావించి ఈ ఏడాది జనవరిలో అందుకోసం ‘ప్రాజెక్టు ప్రిష’ను ప్రారంభించారు. దీనిద్వారా 138 మందికి కుట్టు మిషన్లు అందించారు. మునుగోడు, చండూరు, నల్గొండ, కరీంనగర్‌, రామగుండం, హైదరాబాద్‌లలో 100 మంది మహిళలచేత వస్త్రదుకాణాలూ, కిరాణా దుకాణాలూ, కూరగాయలూ, కొబ్బరి బోండాలు అమ్మే దుకాణాలను ఏర్పాటుచేయించారు. ‘అమ్మచేతి వంట’ కార్యక్రమం ద్వారా రాగిజావ సెంటర్లూ, మధ్యాహ్న భోజనం, పానీపూరీ బండి పెట్టుకుని ఉపాధి పొందేలా 100 మందికి సాయపడ్డారు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న 100 మంది ఉపాధ్యాయినులకు కొన్నినెలలపాటు నిత్యావసరాల్ని పంపిణీ చేశారు. ఇప్పటివరకూ దాదాపు 40వేల మందికి వివిధ రకాలుగా సాయపడ్డారు.

సేవే లక్ష్యంగా...

రాము సొంతూరు నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం, చందుపట్ల. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ సంస్థలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తున్నారు. 2006లో ద్విచక్ర వాహనంపైన వెళ్తున్నపుడు జరిగిన ప్రమాదంలో రాము తలకు బలమైన దెబ్బ తగిలింది. అప్పటికి అతడి భార్య గర్భం దాల్చి ఉంది. ప్రమాదం నుంచి కోలుకున్నాక తన జీవితం సమాజానికీ ఉపయోగపడాలనుకున్నారు రాము. మొదట్లో హెల్మెట్‌/సీటు బెల్టు వినియోగంపైన అవగాహన కార్యక్రమాలూ, రక్తదాన శిబిరాల్ని నిర్వహించేవారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడానికి వేల సంఖ్యలో స్టీలు బాక్సులు పంచిపెట్టారు. హైదరాబాద్‌లో గతేడాది భారీ వర్షాలు వచ్చినపుడు మూడువేల మందికి 25 కిలోలు చొప్పున బియ్యాన్ని అందించారు. కొవిడ్‌ సమయంలో తన పి.ఎఫ్‌. నుంచి అయిదు లక్షల రూపాయలు తీసి ఖర్చుచేశారు. ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ కొనడానికి దాచుకున్న సొమ్మునీ, ఊళ్లో పొలం అమ్మిన డబ్బునీ- మొత్తంగా, సొంతంగా రూ.60 లక్షలూ, స్నేహితుల సాయంతో మరో రూ.40 లక్షలూ... కొవిడ్‌ సమయంలో ఖర్చుచేశారు. ఈ ప్రయాణంలో తన భార్య శ్రీశిల్ప మద్దతుగా నిలుస్తోందని చెబుతారు. రైస్‌ ఏటీఎమ్‌ని ఎప్పటికీ కొనసాగించడం కష్టమే అయినా, ఎవరూ ఆకలితో నిద్రపోకూడదన్న ఉద్దేశంతో దీన్ని కొనసాగిస్తున్నట్లు చెబుతారు రాము.

ఇదీ చూడండి: BUSINESS IN LOCKDOWN PERIOD: కరోనా కాలంలో... దారి మార్చారు దూసుకెళ్లారు!

ABOUT THE AUTHOR

...view details