తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ విషయంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ నెల 12లోగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమేశ్‌కుమార్‌ను రిలీవ్ చేస్తూ తెలంగాణ సర్కారు జీవో ఇవ్వాల్సి ఉంది. కొత్త సీఎస్ నియామకంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది.
సీఎంతో సోమేశ్‌కుమార్ భేటీ..హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం సోమేశ్‌కుమార్ ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం ఆయనకు సూచించినట్లు తెలిసింది. అనంతరం సీఎస్ ప్రగతిభవన్ నుంచి సచివాలయానికి వచ్చి పలువురు అధికారులతో భేటీ అయ్యారు. రాత్రి 9.30 గంటలకు తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
ఆయనకు ఊహించని పరిణామం..సీఎస్‌గా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న సోమేశ్‌కుమార్‌కు మరో 11 నెలల సర్వీసు ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఆయన అనంతపురం కలెక్టర్ సహా వివిధ ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఆయన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. మరో ఎనిమిది మంది సీనియర్లు ఉన్నా.. కేసీఆర్ 2019లో సీఎస్‌గా సోమేశ్‌నే నియమించారు.