Sankranti festival Dont use Chinese manjas: సంక్రాంతి పండగ అంటే రంగురంగుల గాలి పటాలు.. అవి ఎగురుతుంటే చిన్నపెద్దా అందరికీ ఉత్సాహమే. పతంగులు ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు పోటీ పడుతుంటారు. కానీ ఈ గాలి పటాలకు ఉపయోగించే మాంజాపై అప్రమత్తంగా ఉండాలంటోంది అటవీ శాఖ. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించే.. సింథటిక్ చైనీస్ మాంజా వల్ల మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందని వాటిని వాడవద్దని అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాల వాడకాన్ని నిషేధించామని.. వాటిని విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఎగిరే గాలిపటానికి ఆధారం దారం.. పతంగులు గాలిలో ఎగరాలంటే దారంతో పాటు మాంజా కీలకం. సింథటిక్ దారం.. చైనీస్ మాంజా వాడకాన్ని జాతీయహరిత ట్రైబ్యునల్ ఉత్తర్వుల- 2016 ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. గాలిపటాలను ఎగురవేసేందుకు ఉపయోగించే.. గ్లాస్ కోటింగ్‌తో ఉన్న నైలాన్, సింథటిక్ మాంజా వల్ల.. పర్యావరణానికి హాని జరుగుతోంది. దారంలో చిక్కుకున్న పక్షులు విలవిలలాడి మృతి చెందుతున్నాయి. మనుషులు గాయాలపాలవుతున్నారు. నిషేధిత మాంజాలకు బదులుగా సంప్రదాయ కాటన్ దారాలను పతంగులకు వాడాలని అటవీ ఉన్నతాధికారులు సూచించారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారిమి అవుతామని పేర్కొన్నారు.
పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో.. నిషేధిత మాంజా వాడవాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. పాతబస్తీలోని చార్మినార్, గుల్జార్‌హౌజ్, ధూల్‌పేట్, కోఠి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని.. పతంగులు, మాంజాల విక్రయాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనీస్ మాంజా అనర్థాలపై స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కల్పిస్తున్నారు.