కరోనా కష్టకాలంలో సురభి కళాకారులు పడుతోన్న కష్టాలపై 'ఈటీవీ-ఈటీవీ భారత్'లో ప్రసారమైన 'కరోనా నాటకంలో కన్నీటి పాత్రలు' కథనానికి స్పందన లభించింది. హైదరాబాద్ నాగోల్‌లోని రైస్ ఏటీఎం నిర్వాహకులు దోసపాటి రాము, యశస్విని జొన్నలగడ్డలు స్పందించి కళాకారులకు అండగా నిలిచారు. ప్రాజెక్ట్ ప్రిషా ద్వారా లింగంపల్లిలో నివసిస్తోన్న పలు సురభి కుటుంబాలకు చేయూతనిచ్చారు. సురభి కళను మరిన్ని తరాలు కొనసాగించేలా వారికి నాటక సామగ్రిని అందజేశారు.
సురభి కుటుంబాల్లో నాటకాలు లేక ఒంటరిగా ఉంటున్న మహిళలకు కుట్టు మిషన్లు, టిఫిన్ సెంటర్ల సామగ్రి, తోపుడు బండ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ సహాయం సురభి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపకరిస్తుందని పేర్కొన్న దాతలు.. సురభి కళాకారులకు నిత్యం అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన రైస్ ఏటీఎం నిర్వాహకులు, ఈటీవీ-ఈటీవీ భారత్‌కు కళాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.