కరోనా ప్రభావంతో హైదరాబాద్ నగరవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.. నిత్యావసర సరుకులు మెడికల్ షాపులకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇంటి నుంచి బయటకు రావొద్దు.. రోడ్డుపై తిరగొద్దన్న సర్కారు ఆదేశాలతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా నడిరోడ్డే ఆవాసంగా.. దాతల సాయమే ఆహారంగా బతుకుతున్న బిచ్చగాళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది.
కడుపుమీద కొట్టిన కరోనా... ఆదుకుంటున్న మానవత్వం - తెలంగాణలో కరోనా వార్తలు
కరోనా కష్టం మనిషికి తెలుస్తుంది కానీ... కాలుతున్న కడుపుకి కాదు కదా... కూడూ, గూడూ లేక నా అనేవాళ్లు కరవై జానెడు పొట్ట నింపుకోడానికి అష్ట కష్టాలు పడుతున్న యాచకులు పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించిన కారణంగా భాగ్యనగరంలో బిచ్చగాళ్లకు మింగ మెతుకు లేక బిక్కుబిక్కు మంటూ చూస్తున్నారు. వారి పరిస్థితిని గమనించిన కొందరు ఆటోలపై ఆహారాన్ని తీసుకొచ్చి వారి ఆకలి తీర్చుతున్నారు.
భాగ్యనగరం వ్యాప్తంగా... రోజువారి కూలీ పనులు చేసుకుంటూనో... కాగితాలు ఏరుకుంటూనో.. రోడ్డే జీవనాధారంగా... ఫుట్‌పాత్‌లే నివాసాలుగా బతుకుతున్న వారు అటు పనులు లేక... ఇటు ఆహారం లేక నకనకలాడిపోతున్నారు. వారి దుస్థితిని గమనించిన కొందరు ఆటోల్లో ఆహారం తీసుకొచ్చి సికింద్రాబాద్ క్లాక్‌టవర్ పరిసరాల్లో కొందరికి పంపిణీ చేశారు. ఆకలితో అల్లాడిపోతున్న వారికి వారిచ్చే ఆహారం దైవ ప్రసాదంలా ఉంది. ఇప్పుడు ఆహారం అందకపోతే తర్వాత ఎలా బతకాలి అంటూ పొట్లాల కోసం పోటీ పడి దక్కించుకుంటున్నారు. తమ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471