తెలంగాణ

telangana

ETV Bharat / state

జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

ఆదరించిన యజమాని జాడ లేదని దిగాలుగా కూర్చోలేదు... అన్నం పెట్టిన విశ్వాసాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాయి ఈ శునకాలు. ఇటీవల వరదలకు కొట్టుకుపోయిన తమ యజమాని ఆచూకీ కోసం వాగు పరివాహకంలో వెదుకులాడాయి. విగతజీవుడైన యజమాని మృతదేహాన్ని కనుగొన్నాయి...విశ్వాసంలో తమకు తామే సాటి అని మరోమారు నిరూపించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యంలో చోటుచేసుకున్న ఈ సంఘటన శునకాల విశ్వాసానికి గుర్తుగా నిలుస్తుంది.

జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

By

Published : Aug 28, 2019, 11:25 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యం పాడేరు మండలం పాతరపుట్టు గ్రామంలో ఈ నెల 8న లక్ష్మయ్య అనే రైతు వరద ఉద్ధృతికి వాగులో కొట్టుకుపోయాడు. అధిక వర్షాలతో వాగు ప్రవాహం ఉద్ధృతిగా ఉండడం వలన బంధువులు, గ్రామస్థులకు లక్ష్యయ్య ఆచూకీ దొరకలేదు. పాతరపట్టుతో పాటు వాగు పరివాహక గ్రామాల్లో 20 రోజులపాటు వెదుకులాట సాగించిన ఉపయోగంలేకపోయింది.

ఇసుకను తవ్వి మరీ..!

కొడుకు లక్ష్మయ్య కోసం చుట్టుపక్కల గ్రామాల్లో వెదికే ప్రయత్నంలో లక్ష్మయ్య తండ్రి.. తాము పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవాడు. రోజులాగే వెదకడానికి వెళ్లిన లక్ష్మయ్య తండ్రి...పాతరపట్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో కోడాపుట్టు మత్స్యగెడ్డ ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన లక్ష్మయ్య మృతదేహం కనిపించింది. తనతోపాటు వచ్చిన శునకాలు యజమాని లక్ష్మయ్యను గుర్తుపట్టి ఇసుకలో తవ్వడం వలన మృతదేహం బయటపడింది. లక్ష్మయ్య వేసుకున్న చొక్కా ఆధారంగా తండ్రి సన్యాసి కొడుకు మృతదేహాన్ని గుర్తుపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

గుప్పెడు అన్నం పెట్టినందుకు

లక్ష్మయ్య ఆచూకీ తెలియక చింతిస్తున్న కుటుంబ సభ్యులకు...తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నాయి ఈ శునకారు. యజమాని మృతదేహాన్ని కనుగొని వారి ఆవేదనను కొంతమేర తగ్గించాయి. బంధువులందరూ కలిసి వెదికినా దొరకని లక్ష్మయ్య ఆచూకీ పెంపుడు శునకాల వలన సాధ్యమైందని గ్రామస్థులు అంటున్నారు. గుప్పెడు అన్నం పెట్టినందుకు తమ రుణం తీర్చుకున్నాయని అంటున్నారు. శునకాలు యజమానిపై చూపిన విశ్వాసంతో... లక్ష్మయ్య ఆచూకీ దొరికిందని బంధువులు కొంత ఉపశమనం పొందారు.

జాగిలాల విశ్వాసం...యజమాని ఆచూకీ లభ్యం

ఇదీ చూడండి: ప్రపంచానికి మార్గం.. బాపూ యాంత్రీకరణ విధానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details