ఒక్కరై రావడం, ఒక్కరై పోవడం.. అన్నట్లుగా కరోనా మరణాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ తమ కుటుంబంలో ఒకరై, మంచి చెడులకు, ఎదుగుదలకు బాధ్యులైన వారు విధివశాత్తూ అసువులు బాస్తే కడచూపు కోసం తపించని వారుండరు. దూర తీరాల్లో ఉన్న ఆప్తుల కోసం మూడు నాలుగు రోజుల పాటు మృతదేహాలను భద్ర పరచడం సాధారణమే. విదేశాల్లో మరణించిన వారి భౌతికకాయాల కోసం నెలల తరబడి ఎదురుచూడటం మామూలే. తమ వారి మృతదేహాలను తెప్పించండి అంటూ అధికారులు, నేతలను వేడుకునే వారెందరో. తమ తమ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అన్ని క్రతువులను పూర్తిచేసి సగౌరవంగా సాగనంపడం ఒక సంస్కారం. కానీ...కరోనా మహమ్మారి ఈ అన్నింటినీ మటుమాయం చేస్తోంది. క్రతువులు కాదు కదా మృతదేహాలను కనీసం చూడలేని దుస్థితిని తీసుకొచ్చింది. జంతువుల కళేబరాలను వదిలించుకునే రీతిలో సామూహిక ఖననాలు, దహనాలు జరుగుతున్న తీరు కలవరపరుస్తోంది.
సామూహిక దహనం
హైదరాబాద్ ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో నిత్యం కాలుతున్న కాష్టాలను చూస్తే కఠినాత్ములు కూడా కన్నీరు పెట్టాల్సిందే. ఇక్కడ ప్రతి రోజూ పదికి పైగానే కరోనా మృతదేహాలను ఇక్కడ దహనం చేస్తున్నారు. శుక్రవారం ఒకే రోజు 38 మందిని ఇక్కడ సామూహిక దహనం చేశారు. వీరిలో కరోనాతో చనిపోయిన వారు కొందరైతే, అనుమానిత లక్షణాలతో అసువులు బాసిన మరికొందరు ఉన్నారు. సాధారణంగా మృతి చెందిన వారిని ఇక్కడికి తీసుకురావడానికే జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
తమవారి కోసం..
కరోనా సోకి లేదా అనుమానిత లక్షణాలతో గాంధీ, ఇతర ప్రభుత్వాసుపత్రులతోపాటు ప్రైవేటు దవాఖానాల్లో మృతి చెందిన వారిని ఈఎస్‌ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికకు తీసుకువచ్చి దహనం చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా స్థానికులు అంగీకరించకపోవడంతో ఈఎస్‌ఐ సమీపంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. ఆయా ఆసుపత్రుల నుంచి అంబులెన్స్‌ల్లో ప్యాక్ చేసి తీసుకువస్తున్న మృతదేహాలను ఇక్కడ కుప్పలుగా కాల్చేస్తున్నారు. కుటుంబ సభ్యులు జాగ్రత్తల మధ్య దూరం నుంచే అంతిమ సంస్కారాలను చూస్తూ.. తమ వారి చితి ఎక్కడుందోనని విలపిస్తున్నారు.