Dog Attacks in Hyderabad 2024 :సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా కుక్కలు(Dog Bite) మనుషుల మీద దాడి చేస్తుంటాయి. హైదరాబాద్‌లో ఈసారి చలికాలంలోనూ కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే నిత్యం 80 నుంచి 100మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 6వేల 771 మంది బాధితులు రాగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి 4 వేల 800ల మంది రావటం గమనించాల్సిన విషయం. వీటికి తోడు పిల్లి, కోతులు కరిచిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కుక్క కాటుకు గురైన వారు వెంటనే గాయం అయిన ప్రాంతాన్ని శుభ్రంగా కడగటంతో పాటు 24 గంటల్లోపే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకరోజు ఆలస్యమైనా నిర్లక్ష్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యులు యాంటీబాడీస్ థెరపీని సైతం ఇస్తున్నారు. ఫలితంగా రేబీస్ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూచిస్తున్నారు.
Rabies Deaths in Telangana 2024 :మరోవైపు రేబీస్‌తో(Rabies) చనిపోతున్న వారి సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది ఫీవర్ ఆస్పత్రి పరిధిలోనే 12 మంది మృతి చెందారు. కుక్క కాటుకు గురైన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని ఏళ్లుగా వైద్యులు చెబుతున్నా ప్రజలు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఒక్కసారి రేబీస్ సోకితే మాత్రం ఎలాంటి చికిత్స అందుబాటులో లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రూ.20 కోట్ల శునకం హైదరాబాద్‌లో హల్చల్ - చూసేందుకు ఎగబడిన జనం