తెలంగాణ

telangana

ETV Bharat / state

డిస్కంల ప్రైవేటీకరణను అంగీకరించేది లేదు: సీఎండీ ప్రభాకరరావు - Transco, jenco news

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల ప్రైవేటీకరణను ఎట్టిపరిస్థితుల్లో తాము అంగీకరించేది లేదని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం విద్యుత్‌ బిల్లు 2021లో కొన్ని మార్పులు తెచ్చిందన్నారు. ఇందులో డిస్కంల ప్రైవేటీకరణ అంశం యథాతథంగానే ఉందని తెలిపారు. విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ప్రతిపాదించిన బిల్లులో తాజా మార్పులు, వాటి ప్రభావం, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరాకు సంస్థ సన్నద్ధత తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

డిస్కంల ప్రైవేటీకరణను అంగీకరించేది లేదు: సీఎండీ ప్రభాకరరావు
డిస్కంల ప్రైవేటీకరణను అంగీకరించేది లేదు: సీఎండీ ప్రభాకరరావు

By

Published : Mar 17, 2021, 5:38 AM IST

మన రాష్ట్రంలో డిస్కంల పరిస్థితి ఎలా ఉంది?

అవి నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతానికి హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో మినహా దేశంలో అన్ని డిస్కంలది అదే పరిస్థితి. మన దగ్గర సరఫరా, పంపిణీ(టీ అండ్‌ డీ) నష్టాలు తక్కువగానే ఉన్నాయి. రూ.30 వేల కోట్లతో ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను ఆధునికీకరించాం. దీనివల్ల విద్యుత్‌ వృథా తగ్గింది.

విద్యుత్‌ సంస్కరణలపై రాష్ట్ర అభ్యంతరాలు..?

రాష్ట్ర సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. బిల్లులో కొన్ని సవరణలు తెచ్చింది. నేరుగా నగదు బదిలీ (డైరక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌- డీబీటీ) నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వ్యవసాయమీటర్లను పెట్టాలన్న యోచననూ విరమించుకుంది.

పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌పై ఏ విధంగా సమాయత్తమవుతున్నారు?

ఈ వేసవిలో వినియోగం 14వేల మెగావాట్ల వరకూ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి రివర్సబుల్‌ యూనిట్లను వినియోగిస్తున్నాం.

తాజా ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలేమిటి?

రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టబోతున్నాం. వీటి ఏర్పాటుకు ఆర్థిక సాయం కోసం కేంద్రానికి లేఖ రాయదలిచాం.

వ్యవసాయ మీటర్ల విషయంలో ఏ మార్పులు చోటుచేసుకున్నాయి?

రాష్ట్రప్రభుత్వ సూచన మేరకు వ్యవసాయ పంపుసెట్లకు కాకుండా దాని స్థానంలో డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్‌)కు మీటర్లు పెడితే సరిపోతుందని కేంద్రం వివరణ ఇచ్చింది. డీటీఆర్‌లకు మీటర్లు పెట్టటం మంచిదే. దీనివల్ల ఎంత విద్యుత్‌ వినియోగమవుతోందో అర్థమవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వపరిశీలనలో ఉంది.

డిస్కంల ప్రైవేటీకరణతో వినియోగదారులకు ప్రయోజనంకలుగుతుందంటున్నారు..?

ఈ అభిప్రాయం సరికాదు. ప్రైవేటీకరణను విద్యుత్‌ పంపిణీ సంస్థలే కాదు, విద్యుత్‌ ఇంజినీర్లు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపైన తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు.

చైనా మాల్‌వేర్‌ లాంటి సమస్య తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

మన గ్రిడ్‌ దేశంలోనే అద్భుతమైనది. వైరస్‌ విషయంలో ఆదిలోనే అప్రమత్తమై సర్వర్లను ఐసొలేట్‌ చేశాం. ఫైర్‌వాల్స్‌ను, ఆటోమోటివ్‌ సిస్టమ్స్‌ను అప్‌గ్రేడ్‌ చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం.

ఇదీ చూడండి:నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు మోగిన నగారా...

ABOUT THE AUTHOR

...view details