కరోనా భయంతో కొందరు కిడ్నీ రోగులు డయాలసిస్‌కు దూరంగా ఉంటున్నారు. మరికొందరు వారంలో 3-4 సార్లకు బదులు.. ఒకటి రెండు విడతలతో సరిపెడుతున్నారు. ఆసుపత్రులకు వెళ్తే ఇతర రోగాలు వచ్చే అవకాశం ఉందన్న భయం వారిని వెంటాడుతుండటమే కారణం కావచ్చు. అయితే డయాలసిస్‌లు తగ్గించుకోవడం, లేదంటే పూర్తిగా మానేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోగుల్లో ఇది తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని, కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సలహాలు పాటించాలి
నగరానికి చెందిన 52, 63 ఏళ్ల ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరు వారానికి మూడుసార్లు చేయించుకోవాలి. అయితే కరోనా వ్యాప్తి భయంతో ఒకటి, రెండు విడతలకు మాత్రమే పరిమితమయ్యారు. వైద్యుల సలహా కూడా పాటించకపోవడం వల్ల ఇటీవల ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడం వల్ల కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలు పూర్తిగా పాడవడం వల్ల అవి రక్తాన్ని వడపోసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. బయట నుంచి యంత్రం ఆ పని చేస్తుంది. దీనినే డయాలసిస్ అంటారు.
గుండె లయ తప్పుతుంది
ఒక్కో రోగి పరిస్థితిని బట్టి వారానికి 3-4 సార్లు డయాలసిస్‌లు అవసరం అవుతుంది. లేదంటే రక్తంలో పొటాషియం పెరిగిపోయి గుండె లయ తప్పుతుంది. ఇదే కొన్నిసార్లు ఆకస్మిక గుండె వైఫల్యానికి(సడన్ కార్డియాక్ అరెస్టుకు) దారి తీసి, ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అదే విధంగా డయాలసిస్‌కు దూరంగా ఉంటే.. ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరి.. పల్మనరీ ఎడిమాకు దారి తీస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టమై.. అది కరోనా కంటే ఎక్కువ తీవ్రత ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.