Doctors Stole Kidney Of A Patient in Hyderabad :వైద్యులను దేవుళ్లతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే ఏదైనా రోగం వచ్చినప్పుడు చావు నుంచి తప్పించి, పునర్జన్మనిస్తాడని. దైవంగా భావించి వైద్యులు తమ ప్రాణాన్ని నిలబెడతారని రోగులు వారిపై నమ్మకాన్ని ఉంచుతారు. ఈ నమ్మకాన్నే ఆసరాగా తీసుకొని కొందరు డాక్టర్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రోగికి ఆపరేషన్ పేరుతో కిడ్నీని మాయం చేశారు. ఇలా చేసినందుకు రోగికి పరిహారంగా రూ.30 లక్షలు, రూ.25 వేలు ఖర్చుల కోసం ఇవ్వాలని కోర్టు ఆ డాక్టర్లను ఆదేశించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే :ఖమ్మ జిల్లా కొత్తగూడెంకు చెందిన రేణుకుంట్ల రవిరాజు వాహన మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు 2007లో కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో చేరగా వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత 2009 జులైలో హెర్నియా సమస్యతో సికింద్రాబాద్‌లోని పౌలోమి ఆసుపత్రిలో చేరగా అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రవిరాజుకు ఆపరేషన్ నిర్వహించి, జులై 31న డిశ్ఛార్జి చేశారు.
Kidney Thefts in Hyderabad :ఆ తర్వాతబాధితుడు 2011లో కోల్‌కతాలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా మరోసారి కడుపు నొప్పి రావడంతో అక్కడే ఉన్న ఆసుపత్రిలో చూపించుకుని హెర్నియాకు ఆపరేషన్ చేసుకున్నారు. ఈ చికిత్సకు ముందు జరిపిన పరీక్షల్లో ఎడమవైపు కిడ్నీ(Kidney) కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ఆ మాటలను పట్టించుకోని బాధితుడు, మళ్లీ 2012లో కడుపు నొప్పి రావడంతో ఖమ్మం మెడికేర్ డయాగ్నోస్టిక్ సెంటర్, మమత మెడికల్ కాలేజీల్లో పరీక్షలు చేయించుకున్నారు.
అక్కడ కూడా ఒక కిడ్నీ లేదన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. హెర్నియా ఆపరేషన్ సమయంలో పౌలోమి ఆసుపత్రి వైద్యులు తనకు తెలియకుండా కిడ్నీని తొలగించారని, దానిని రూ.50 లక్షలకు అమ్ముకున్నారని బాధితుడు ఆరోపించారు. కిడ్నీ లేని లోటు తన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అందుకు రూ.50 లక్షలు పరిహారం డాక్టర్లు చెల్లించేలా చూడాలని వినియోగదారుల కమిషన్‌ను బాధితుడు కోరారు.
కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు... ప్రధాన నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్