తెలంగాణ

telangana

ETV Bharat / state

బంధాలు వదలి.. బాధ్యతలకు కదలి.. - నిబద్ధతను చాటుతున్న వైద్యులు

కరోనా కాలంలో ఎందరో తమ నిబద్ధతను చాటుతున్నారు. ముఖ్యంగా వైద్యులు రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడుతున్నారు. కరోనా మహమ్మారికి భయపడకుండా… వ్యాధిని తగ్గించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.

husband and wife works hospsital in corona time
బంధాలు వదలి.. బాధ్యతలకు కదలి..

By

Published : Jun 1, 2020, 1:52 PM IST

ఆ భార్యభర్తలిద్దరూ వైద్యులే. భర్త నిమ్స్‌లో విధుల్లో ఉంటే.. భార్య గాంధీలో సేవలు అందిస్తున్నారు. కరోనాతో వారి జీవితాలే మారిపోయాయి. ఇది వరకు ఆదివారం వస్తే కుటుంబమంతా సరదాగా... బయటకు వెళ్లి గడిపేవారు. కొవిడ్‌ వారి జీవనశైలినే మార్చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రి నుంచి నేరుగా ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. అదే అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న మరో ఫ్లాట్‌ను రూ.20 వేలకు అద్దెకు తీసుకున్నారు. అయిదు రోజుల పాటు అక్కడే ఉంటున్నారు. అనంతరం ఇంటికి వచ్చినా సరే...ప్రేమగా పిల్లలను దగ్గరకు తీసుకొనే అవకాశం లేదు. కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తున్నారు. కరోనా వేళ...ఎంత కష్టమైనా సరే...బాధ్యతలెరిగి ఈ వైద్య దంపతులు తమ సేవలు అందిస్తున్నారు.

వీరే కాదు...

గాంధీలో సేవలు అందించే ఎంతోమంది వైద్యులు రాత్రి పగలు విధుల్లో మునిగి తేలుతున్నారు. కుటుంబాలకు దూరంగా సేవలు అందిస్తున్నారు. రోస్టర్‌ ప్రకారం ఇక్కడ విధులు కేటాయిస్తున్నారు. ఒక వైద్యుడు 24 గంటల పాటు సేవలు అందించిన తర్వాత అయిదు రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో నేరుగా ఇంటికి వెళ్లడం సాహసమే. ఎందుకంటే వైరస్‌తో ఉన్న వారి పక్కనే నిత్యం ఉండటం వల్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు వైద్యులకే కాదు... వారి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం లేకపోలేదు. దీంతో కొందరు ఇళ్లకే వెళ్లడం లేదు. గాంధీ పక్కనే ఉన్న వసతి గృహాల్లో తలదాచుకుంటున్నారు.

వైద్యుల ఇళ్లల్లో గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులుంటే.. మరిన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. తమ ఇంటికి సమీపంలో లేదంటే, తమ అపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో దూరంగా ఉండి మాట్లాడుతున్నారు. నాలుగైదు రోజుల తర్వాత.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ.. అప్పుడు ఇంట్లోకి వస్తున్నారు. మరికొందరు విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్రత్యేక గదిలో ఉంటున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులనూ కలవడం లేదు. కనీసం పిల్లలను ప్రేమగా దగ్గరకి తీసుకునే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్నన్ని రోజులు గ్లౌజులు, మాస్క్‌లు ధరిస్తున్నారు. భోజనం ప్లేటు నుంచి అన్ని వస్తువులను ప్రత్యేకంగా వినియోగిస్తున్నారు. ఇలా వృత్తి బాధ్యతలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ పలువురిలో స్ఫూర్తి నింపుతున్నారు.

కీలకంగా గైనిక్‌ విభాగం...

ప్రస్తుతం గాంధీలో గైనిక్‌ విభాగం కీలకంగా మారింది. గర్భిణుల్లో పలువురికి కరోనా సోకి చికిత్స పొందుతున్నారు. వీరిలో నెలలు నిండిన వారికి పురుడు పోయడం కత్తి మీద సామే. పుట్టిన బిడ్డకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు గైనిక్‌ విభాగం సిబ్బంది.. కరోనాతో బాధపడుతున్న నలుగురు మహిళలకు పురుడు పోశారు. శిశువుల నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు శిశువులకు కరోనా లేనట్లు తేలింది. కరోనా ఉన్న తల్లుల నుంచి పిల్లలను దూరంగా ఉంచి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చిన్న పిల్లల వార్డులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంటికి దూరంగా ఉంటున్నామనే మనసులో ఎక్కడో కొంత వెలితిగా ఉన్నా.. మరోవైపు ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుండటంతో ఆ బాధ మరచిపోయేలా చేస్తుందని పలువురు వైద్యులు అంటున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్‌ కేసులు... ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details