తెలంగాణ

telangana

ETV Bharat / state

సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుంది: సుధాకర్ తల్లి - vishaka doctor sudhakar mother on court verdict news

ఆంధ్రప్రదేశ్ సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని డాక్టర్ సుధాకర్ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. తన కుమారుడికి న్యాయం జరగాలని కోరారు. పరువు కాపాడుకోవాలంటే హైకోర్టే తమకు దిక్కని పేర్కొన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందన్న ఆమె... ఇంత జరిగినా అధికారులు ఎవరూ రాలేదని చెప్పారు. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

doctor-sudhakar-mother-reaction-on-high-court-verdict
సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుంది: సుధాకర్ తల్లి

By

Published : May 23, 2020, 9:48 AM IST

ఏపీలోని డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై ఆయన తల్లి లక్ష్మీబాయి హర్షం వ్యక్తం చేశారు. కొడుకు ఎంత చెడ్డవాడైనా స్టేషన్‌కు వెళ్లి మరీ అతడిని కొట్టాలని ఏ తల్లయినా చెబుతుందా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ‘ఈనాడు- ఈటీవీ- ఈటీవీ భారత్​తో ఆమె మాట్లాడిన అంశాలిలా ఉన్నాయి..

‘‘నా కుమారుడి విషయంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఇచ్చిన ఆదేశం చాలా సంతోషం కలిగించింది. కన్నతల్లిగా కొడుకు ఆ పరిస్థితిలో ఉంటే ఎంత బాధ ఉంటుంది? హైకోర్టు జోక్యం వల్ల కొంతవరకైనా న్యాయం జరిగిందని భావిస్తున్నా. ఇది ఒక్క నా బిడ్డ కోసమే కాదు. చదువుకున్న మా వాడినే ఈ దుస్థితికి తీసుకొచ్చారు. మిగిలిన వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ఆందోళనగా ఉంది. నా కుమారుడికి కోర్టు ద్వారానే న్యాయం జరుగుతుంది. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు.. ‘సుధాకర్‌ను కొట్టాలని చెప్పడానికే వచ్చారు కదా’ అని పోలీసులన్నారు. అసలే బాధతో ఉన్న నన్ను అడగాల్సిన ప్రశ్నేనా అది? వారికీ తల్లులు ఉన్నారు కదా? అలాంటి ప్రశ్న వేయొచ్చా? అలాంటి ప్రశ్నలు వేస్తున్నారంటే వారు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచించాలి. దీన్నిలాగే వదిలేస్తే చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఈ గొడవతో నరకం అనుభవిస్తున్నాం. తిండీ తిప్పల్లేకుండా తీవ్ర మనోవేదన అనుభవించాం. సీబీఐ దర్యాప్తుతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’. - సుధాకర్ తల్లి

గంటల్లోనే ‘మానసిక సమస్య’ ముద్ర

ఏపీ ముఖ్యమంత్రిని, పోలీసులను, స్థానికులను దూషించారంటూ డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత.. మద్యం మత్తులో ఉన్నారని వైద్యపరీక్షల కోసం కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ ఆయన అనుచితంగా ప్రవర్తించారంటూ ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. మద్యం ప్రభావం సాధారణంగా 10-12 గంటల వరకు ఉంటుంది. అందుకే మత్తు దిగాక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేస్తారని వైద్యనిపుణులు అంటున్నారు. కానీ, సుధాకర్‌ను మానసిక ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది గంటలకే ఆయన ‘ఎక్యూట్‌ అండ్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్‌’ అనే సమస్యతో బాధ పడుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పేరుమీద పౌరసంబంధాలశాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. సాధారణంగా మానసిక వైద్యులు.. సమస్యను కనీసం 48 గంటలపాటు అధ్యయనం చేశాకే వ్యాధిని నిర్ధారిస్తారు. కానీ డాక్టర్‌ సుధాకర్‌ను ఈనెల 16 సాయంత్రం అదుపులోకి తీసుకుని.. రాత్రి 10.40కల్లా ఆయన మానసిక సమస్య ఇదీ అంటూ తేల్చేశారు. స్వయంగా వైద్యుడైన ఆయన.. తాను బాగానే ఉన్నానని చెప్పినా 14 రోజులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తామని ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌ గురువారం ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

మరో కానిస్టేబుల్‌?

డాక్టర్‌ సుధాకర్‌ను లాఠీతో కొట్టిన ఒక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను విశాఖ సీపీ ఆర్‌.కె.మీనా ఆ రోజే సస్పెండ్‌ చేశారు. టీవీ దృశ్యాల ఆధారంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంకొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో మరో కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి:వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details