DL Ravindra Reddy on Viveka Murder Case : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులు, సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయట పెడుతుందని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్మార్ట్ మీటర్ల అంశంపై ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతోందని మండిపడ్డారు. ఇదే సందర్భంలో వివేక హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలను డీఎల్ వెల్లడించారు. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని డీఎల్ ఆరోపించారు. హంతకుల వివరాలను సీబీఐ అధికారులు బయట పెట్టకముందే ముఖ్యమంత్రి అసలు హంతకుల వివరాలను వెల్లడిస్తే మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారని రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఆ కేసు తేలిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని అన్నారు. వివేక కేసులో సీబీఐ అధికారులు తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా విచారించాలని డీఎల్ డిమాండ్ చేశారు. ఎర్ర గంగిరెడ్డి కేసు తేలిన తర్వాత సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ కూడా విచారిస్తుందని విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
'వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులు, సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయట పెడుతుంది. వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి తెలుసు. ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారు. ఎర్ర గంగిరెడ్డి కేసు తేలిన తర్వాత సీబీఐ తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా విచారిస్తుందని అనుకుంటున్నాను.'- డీఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి