DK Aruna on Tukkuguda Congress Sabha : కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ తోడు దొంగలుగా ఉండి.. బీజేపీపైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ(BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తుంటే.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. దేశంలో వైషమ్యాలు, అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి సమంజసమా అని ప్రశ్నించారు.
DK Aruna fires on Congress :కాంగ్రెస్ తుక్కుగూడ విజయభేరి సభలో ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రకటించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్(Congress) పార్టీ ముందుగా ప్రజలకు మూడు గ్యారెంటీలు ఇవ్వాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారారని గ్యారెంటీ ఇవ్వాలన్నారు, స్కాంలు, కుంభకోణాలు చేయమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించమని గ్యారంటీ ఇవ్వాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందని.. మత విద్వేషాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి బీజేపీపై విషం చిమ్మి లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా?, 4 వేల ఫించన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అధికార ఆకాంక్ష తప్పితే దేశ అభివృద్ధి మీద ధ్యాస లేదన్నారు. విచ్చలవిడిగా ఉచితాలతో కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని.. ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారన్నారు.