DK aruna fire on rahulgandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాపాధ్యక్షురాలు డీకే అరుణ విరుచుకుపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావట్లేదని ఆరోపించారు. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలేనని సంబోధిస్తారా? అని మండిపడ్డారు. లండన్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్ పరువు తీశారంటూ... దేశ ప్రతిష్టను మంట కలిపారని అనడం సరికాదని అన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
దొంగల ఇంటి పేరు మోదీ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితంగానే రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పునిచ్చిందని ఆమె గుర్తు చేశారు. దానికి బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. కోర్టు తీర్పునకు, బీజేపీకి ముడి పెడుతూ కాంగ్రెస్ పార్టీ గొడవ చేయడం సరికాదని అన్నారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రజలపై ఉన్న కాంగ్రెస్ అహంకారానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. రాహుల్ ఉన్నంత కాలం పార్టీ బాగుపడదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తక్షణమే రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు.... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన సభలో రాహుల్‌గాంధీ మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను పెద్ద ఎత్తున మోసం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశిస్తూ దొంగలందరి ఇంటి పేర్లు మోదీయే ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో రాహుల్‌పై భారతీయ శిక్షా స్మృతి 499, 500 ప్రకారం కేసు రిజస్టర్ అయ్యింది. ఈ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పార్టీ నేతలు అన్నారు. అదానీ కుంభకోణంపై చర్చ జరుగకుండా ఉండేందుకే రాహుల్ పై వేటు వేశారని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: