ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలో దీపావళి అనే ఊరుంది. చరిత్ర ఆధారంగా చూస్తే.. దశాబ్దాల కిందట శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఆ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళాన్ని అప్పట్లో సిక్కోలుగా పిలిచేవారు. అప్పటి సిక్కోలు రాజు కళింగపట్నం ప్రాంతానికి అశ్వంపై ఈ ఊరు మీదుగా వెళ్తుండేవాడు. ఓ సారి ఈ ఊరిగుండా వెళ్తుండగా ఎండ తీవ్రతకు కొబ్బరితోటలోని విష్ణు దేవాలయ సమీపంలో స్పృహ తప్పి పడిపోయారట. సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజు గారిని గుర్తించి సపర్యలు చేశారట. రాజు కోలుకున్న తర్వాత వారికి కృతజ్ఞతలు తెలిపారట. అదే రోజు దీపావళి పర్వదినం కావడం వల్ల.. ఆ సందర్భానికి గుర్తుగా గ్రామానికి రాజుగారు దీపావళి అని నామకరణం చేసినట్లు చరిత్ర. నాటి నుంచి ఆ గ్రామం పేరు దీపావళిగా కొనసాగుతోంది. రెవిన్యూ రికార్డుల్లో కూడా దీపావళిగానే నమోదైంది.
300 గృహాల సముదాయం..వెయ్యి మంది జనాభా
శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలోలో ఉన్న దీపావళి గ్రామంలో సుమారు 300 గృహాలు ఉన్నాయి. గ్రామ జనాభా వెయ్యిమంది. ఈ గ్రామం దీపావళిగా ప్రాచుర్యం పొందటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండుగ పేరు.. తమ గ్రామానికి ఉండడం సంతోషంగా ఉందంటున్నారు. ఈ ఊళ్లో మరో విశేషం కూడా ఉంది. దీపావళి పర్వదినానే పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు.