Diwali festival 2022: చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి. తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకొనే సంతోషాల సంబరమిది. ఈ తరంలో చాలామంది దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకొనే పండుగే అనుకుంటారు. నిజానికి ఇది ఐదు రోజుల పాటు జరుపుకొనే ఆనందాల వేడుక.
ధన త్రయోదశి.. దేవదానవులు అమృతం కోసం మథించిన పాలకడలి నుంచి శ్రీమహాలక్ష్మీ ఉద్భవించింది. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వీయుజ బహుళ త్రయోదశి. ఈ రోజును ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఈ రోజున కాస్త అయిన బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది. కుబేరుడు ఆమెను పూజించి అనుగ్రహం పొంది ఎంతో ధనవంతుడు అయ్యాడు. ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు.
నరక చతుర్దశి..లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేస్తారు. ఉదయాన్నే ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి. ఆ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.
దీపావళి అమావాస్య..ఈ రోజు పంచత్వక్కులైన మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల బెరళ్లను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. దరిద్ర దేవతను వెళ్లగొట్టేందుకు శ్రీమహాలక్ష్మిని పూజించాలి. తర్వాత బలి చక్రవర్తిని స్థాపించి ఉత్సవాలు చేయాలి. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. ధనాధిపతి కుబేరుడినీ పూజించాలి. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్మిక.