Diwali Dad in Vijayawada: పండుగ వచ్చిందంటే చిన్నారుల్లో ఉండే ఆనందమే వేరు. అదే దీపావళి అయితే, ఇక వారి ఆనందానికి అవధులే ఉండవు. రకరకాల టపాసులు కొనమని తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటారు. మరి ఎవరూ లేని అనాథల పరిస్థితి ఏంటి.?. శుభకార్యాలప్పుడు వారికి భోజనాన్ని అందించే వారు ఉంటారు గానీ.. ఇంటికి పిలిచి యోగక్షేమాలు అడిగే వారు ఎవరూ ఉండరు. తల్లిదండ్రులు లేని వారికి టపాసులు ఎవరు కొనిపెడతారు. వారి సంతోషాల్ని తీర్చేదెవరు.? ఇదే ఆలోచనతో, పన్నెండేళ్లుగా అనాథలతో పండుగ జరుపుకుంటూ.. దీపావళి డాడీగా మారిపోయారు ఓ వ్యక్తి.
తెదేపా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు:ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలోని కేర్ అండ్ షేర్ సంస్థ అనాథలను, హెచ్‌ఐవీ సోకిన పిల్లల్ని అక్కున చేర్చుకుని.. వారి ఆలనా పాలన చూస్తోంది. వారికి అన్నిరకాల వసతుల కల్పనతో పాటు విద్య అందిస్తున్నారు. కానీ వీరికి తల్లిదండ్రులు లేని లోటు తెలియనీయకుండా, విజయవాడ మల్లిఖార్జున పేటకు చెందిన తెదేపా కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఓ మంచి నాన్నలా అండగా నిలుస్తున్నారు. పన్నెండేళ్లగా ప్రతి దీపావళికి గన్నవరం నుంచి పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లి.. ఘనంగా వారితో పండుగ జరుపుకుంటున్నారు. ఈ ఏడాదీ పిల్లలను ఇంటికి తీసుకెళ్లి వారు కోరినట్లు భోజనాలు ఏర్పాటు చేశారు. టపాసులు పేల్చుతూ, ఆటపాటలతో చిన్నారులు సంతోషంగా పండుగ జరుపుకున్నారు.