దీపకాంతుల నడుమ కళకళలాడిన పల్లెలు, పట్టణాలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి వేడుకలు...రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. దీప కాంతులతో హైదరాబాద్ నగరం కళకళలాడింది. చిన్నాపెద్ద అందరూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. బేగం బజార్‌లో స్థానికులు టపాసుల మోత మోగించారు. మారేడుపల్లిలోని తన నివాసంలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
సందడిగా కాలుస్తూ..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువత బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. రంగురంగుల విద్యుత్ కాంతుల నడుమ ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రజలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పట్టణంలో యువత, చిన్నారులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. వరంగల్‌లో ఊరూవాడా దీపకాంతులతో లోగిళ్లన్నీ దేదీప్యమానమయ్యాయి. పిల్లలు, పెద్దలు పోటీపడి బాణసంచా కాల్చారు. కరోనా నేపథ్యంలో గ్రీన్‌కాకర్స్‌తో పండుగ నిర్వహించుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.
వ్యాపారులు టపాసులు
ఆదిలాబాద్‌లో దీపావళి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పట్టణంలోని ఆయా దుకాణాల ముందు వ్యాపారులు టపాసులు పేల్చారు. ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఇప్పచెల్మాలో ఆదివాసీలు దండారి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నెమలీకలతో చేసిన టోపీ ధరించి శరీరమంతా విభూతి పూసుకొని, చేతిలో కర్ర, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవికి పూజలు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లో దుకాణదారులు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. పట్టణంలో చిన్నారులు, పెద్దలు కలిసి టపాసులు పేల్చారు. చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్... వేములవాడలో సుర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్... తమ కుటుంబసభ్యులతో కలిసి బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. ఆయా పట్టణాల్లో యువత ఉత్సాహంగా టపాసులు పేలుస్తూ వేడుకలను ఆనందంగా నిర్వహించుకున్నారు. ఖమ్మంలోని తన నివాసంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.... కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చారు. మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇదీ చూడండి :కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు