తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్వెల కాంతులు... టపాసుల జిలుగులు...

పట్టు వస్తాలు.. లక్ష్మీపూజలు... ముంగిట ముగ్గులు... వీధంతా దివ్వెలు... నోరూరించే పిండి వంటలు... చిన్నారుల ముఖాల్లో నవ్వులు... టపాసుల మోతలు... ఇంటింటా ఆనందాల వెలుగులతో... రాష్ట్రమంతా దీపావళి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆకాశంలోని నక్షత్రాలే భువికి దిగినట్టుగా... దివ్వెల వెలుగులు ప్రతీ ఇంటా సంతోషాలు నింపుతున్నాయి.

DIWALI CELEBRATIONS IN TELANGANA OVERALL STORY

By

Published : Oct 27, 2019, 10:31 PM IST

Updated : Oct 27, 2019, 11:37 PM IST

దివ్వెల కాంతులు... టపాసుల జిలుగులు...
జీవితంలో బాధల చీకటిని పారద్రోలుతూ... ఆనందాల వెలుగులు నిండే వేళ... ప్రతీ ఇంటా సుఖసంతోషాల తోటలు విరబూసే వేళ... రాష్ట్రమంతా దివ్వెల పండుగను కోలాహలంగా జరుపుకుంటోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా చెప్పుకునే ఈ వేడుక... ఇంటింటా నవ్వుల దివ్వెలు వెలిగిస్తోంది.

మధురంగా మారిన తరుణం...

అన్ని జిల్లాల్లో ఉదయం నుంచి పండుగ సంబురాలు మొదలయ్యాయి. ప్రత్యేక పూజలతో దేవాలయాలు కిటకిటలాడాయి. మామిడి తోరణాలు... పూల అలంకరణలతో ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ముస్తాబయ్యాయి. వేకువజామునే లక్ష్మీపూజలు చేసి... ఇంటి పెద్దలకు హారతులు ఇచ్చారు. తీపి పదార్థాల సువాసనలతో వీధులన్నీ ఘుమఘుమలాడాయి. నోరూరించే పిండి వంటలతో వేడుకలు మధురంగా మారాయి.

తారలే భువికి చేరిన వేళ...

సాయంత్రం వేళ దీపాల కాంతులతో గల్లీలన్నీ మెరిసిపోయాయి. నింగిలోని చుక్కలే నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా దివ్వెల వరుసలు వెలుగులు విరజిమ్మాయి. ఇక చిన్నా, పెద్దా తేడా లేకుండా టపాసుల మోత మోగిస్తున్నారు. కాకరపూవ్వొత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలతో వెలుగుజిలుగులు నిండిపోతున్నాయి. రంగురంగుల వెలుగులతో రాకెట్లు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయి. తమలోని ఆనందపు ప్రకాశాన్ని నింగికి అందజేసినట్టుగా వెలుగులు జిమ్మే టపాసులను పేల్చుతూ పండుగను ఆస్వాదిస్తున్నారు.

టపాసులు కాల్చేవేళ జాగ్రత్తలు తీసుకుంటూ... తల్లిదండ్రులు తమ చిన్నారులను పండుగను ఆనందించేలా చూసుకుంటున్నారు. తగు జాగ్రత్తలతో పండుగను సురక్షితంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈటీవీ భారత్​ తెలంగాణ ప్రేక్షకులకు మరొకసారి దీపావళి శుభాకాంక్షలు.

ఇదీ చదవండిః నరకాసురుడు ఎందుకు ఓడిపోయాడు...?

Last Updated : Oct 27, 2019, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details