Taxidermy: చనిపోయిన జంతువులు, పక్షులకు పూర్వపు ఆకృతినిచ్చి.. అవి బతికున్నట్టుగా తీర్చిదిద్దే కళే టాక్సీడెర్మీ. సైన్స్‌పై పట్టుండి.. శిల్పకళ తెలిసిన వారికి మాత్రమే ఈ ఆర్ట్ సాధ్యం. దీంట్లో ఆరితేరిన నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువగా ఉంటారు. వారిలో దివ్య అనంతరామన్ ఒకరు. అత్యుత్తమ టాక్సీడెర్మీ కళాకారిణిగా పురస్కారాన్ని అందుకున్న దివ్య.. ఈ రంగంలోకి రావడం కూడా చిత్రంగానే జరిగిందని చెప్తుంది.
దివ్య న్యూయార్క్‌లో స్థిరపడ్డ తమిళ అమ్మాయి. దివ్య తల్లిగారు బయాలజీ టీచర్ కావడంతో.. ల్యాబ్‌లోని జార్లలో పెట్టిన జంతువుల కళేబరాలను చూసీ.. చూసీ.. అవంటే భయం పోయింది. ఐదేళ్ల వయసులో ఇంట్లో బల్లి చచ్చిపడి ఉండగా.. దానిని తనకు ఇష్టమైన సముద్ర గులక రాళ్లు దాచుకునే పెట్టెలో దాచి పెట్టింది. రెండ్రోజుల తర్వాత అది దుర్వాసన రాగా.. అది తన మొదటి వైఫల్యమని బాధపడింది దివ్య.
షూ డిజైనర్ కాస్తా.. టాక్సీ డెర్మిస్టయ్యింది..: ఆ తర్వాత రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన జంతువులని ఇంటికి తేవడం మొదలుపెట్టింది. అది గమనించిన దివ్వ అమ్మగారు ఇప్పుడు కాదు.. దీనికో కోర్సు ఉంది. పెద్దయ్యాక అది చదివి అప్పుడు దాచిపెడుదువులే అంది. నిజానికి దీనికంటూ కోర్సుల్లేవు. చదువు పూర్తి అయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరిన దివ్య.. షూ డిజైనర్‌గా స్థిరపడింది. ఖాళీ సమయాల్లో టాక్సీ డెర్మిస్టుల దగ్గరికి వెళ్లి మెళ్లిమెళ్లిగా ఈ కళను నేర్చుకుంది. టాక్సీ డెర్మిస్టులో పూర్తి పట్టొచ్చాక ఫ్యాషన్ డిజైనింగ్ వదిలేసి, ఈ రంగంలోకి మారానని అంటోంది దివ్య.
సొంతంగా సంస్థ..: టాక్సీడెర్మీ అంటే గ్రీక్లో చర్మాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చడం అనే అర్థం. చనిపోయిన పక్షులు, పాలిచ్చే జంతువులు, ఎలుకలు వంటి వాటిని తీసుకుని కొన్ని నైపుణ్యాలతో వాటికి జీవకళ తీసుకొస్తారు. ఇది చాలా ఓపికతో కూడిన వ్యవహారం. అలా క్రమంగా ఎదిగిన దివ్య.. గోతమ్ టాక్సీడెర్మీ అనే సంస్థను స్థాపించింది. విద్యాసంస్థలు, మ్యూజియాలు, గ్యాలరీలు.. జంతువులపై ఆసక్తి ఉండి వాటి గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి దివ్య సేవలు ఉపయోగపడతాయి.
అలా చేసి సహజ అందం..: ఈ టాక్సీడెర్మీలో జంతు కళేబరాన్ని సేకరించి.. దాన్ని శుభ్రపరచాలి. ఒక్కో చర్మానికి ఒక్కో రకం రసాయనం వాడాలి. ఆకృతిలో తేడా రాకుండా మధ్యలో దూదిలేదా ఇతర మెటీరియల్‌ను వాడతారు. జీవుల అందం ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు చెక్క, యాక్రిలిక్ పెయింట్స్, వ్యాక్స్, సిలికాన్, ఎపాక్సీ, ఎయిర్ డ్రైయింగ్లు వంటివి వాడి సహజ అందాన్ని తీసుకొస్తామని దివ్య చెబుతోంది.