సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేదలకు పలమనేరు నుంచి 7రకాల 22టన్నుల తాజా కూరగాయలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెప్పించారు. కాచిగూడ స్టేషన్ రోడ్డులోని టూరిస్ట్ హోటల్లో వీటిని నిల్వ చేసి అక్కడ నుంచి సిబ్బంది, పార్టీ కార్యకర్తలతో మోదీ కిట్లలో ప్యాకింగ్ చేయించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలన్నింటికీ సరఫరా చేయించారు. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వివిధ ప్రాంతాలకు కూరగాయలతో వెళ్లే ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ప్రతి అసెంబ్లీకి సుమారు 500 వరకు మోదీ కూరగాయల కిట్లను పంపిణీ చేశారు.
ప్రతి పేద కుటుంబానికి 7 రకాలు..5 కేజీలు
స్థానిక భాజపా నాయకత్వం కూరగాయల కిట్లను పేదలకు, కూలీలకు అందజేయనుంది. మంత్రి కిషన్ రెడ్డి రెండోసారి కూరగాయలను తెప్పించడం సంతోషంగా ఉందని లక్ష్మ ణ్ కొనియాడారు. ప్రతి అసెంబ్లీలో ఒక్కో కుటుంబానికి ఐదు కేజీల, 7 రకాల వెజిటబుల్ కిట్లను అందిస్తామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని లక్ష్మణ్ కోరారు. మర్కజ్ ఘటన లేకపోతే తెలంగాణలో కరోనా కేసులే ఉండేవి కావని ఆయన పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలన్నారు. కార్యక్రమంలో భాజపా సీనియర్ నేతలు ప్రకాష్ రెడ్డి, ఛాయా దేవి, వెంకట్ రెడ్డి, గౌతం రావు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు