హైదరాబాద్ కూకట్‌పల్లిలో పేదలకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆపన్న హస్తం అందించారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పేదలకు, వలస కూలీలకు 5000 క్వింటాళ్ల బియ్యం, 100 క్వింటాళ్ల పప్పులు, కూరగాయలను పంపిణి చేస్తున్నారు. బోయిన్ పల్లి, బాలానగర్, ఫతే నగర్, బేగం పేట్, మూసాపేట్, అల్లాపూర్ డివిజన్ లలో కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నిత్యావసర వస్తువులను అందించారు.
మీ సేవలు ఆదర్శనీయం !
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో సరకులను పంచడం అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పేదలకు అవసరమైన వంటింటి సామగ్రి ప్రభుత్వం అందిస్తున్నందున అందరూ ఇళ్ళకే పరిమితమవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కృష్ణారావును ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చి పేదలకు సాయమందించాలని మంత్రి కోరారు. రోజుకు 10 వేల మందికి నిత్యావసర సరకులను 4 రోజుల పాటు అందించనున్నామని మల్లారెడ్డి తెలిపారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నట్లు తన దృష్టికి వస్తే అందుకు తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.